మా గూడు చెదర్చకండి సార్లూ!.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరం చూపని పోలీసులు

by Sridhar Babu |   ( Updated:2021-12-17 01:27:32.0  )
Gudise-Wasulu-1
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ‘నివసించేందుకు తమకు ఆవాసం లేక గూడుకట్టుకుని నివాసం ఉంటున్నాం.. మా గూడును చెదర్చకండి సార్లూ’ అని పోలీసులను, రెవెన్యూ అధికారులను గుడిసె వాసులు వేడుకున్నా కనికరించలేదని ఘొల్లుమన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్. 263 లో రెండు నెలల క్రితం కొంతమంది నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గుడిసెలలో నివాసం ఉంటున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి గుడిసెలను కూల్చివేశారు. సుమారు మూడువందల మంది పోలీసులు సుమారు 1500 ల గుడిసెలను కూల్చివేసి, జేసీబీలతో ట్రెంచ్ కట్టి పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా సమీప కాలనీలలో తలదాచుకున్న కొంతమంది గుడిసె వాసులు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అరెస్ట్ చేసిన తమ కాలనీ వాసులను విడుదల చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. పేదవాళ్లమని, కనికరించమని వేడుకున్నా.. కాళ్లు పట్టుకున్నా, పోలీసులు ,అధికారులు కనికరించలేదని, కట్టుబట్టలతో బయటకు వెళ్లామని ఏడ్చారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు మాట్లాడేందుకు నిరాకరించారు.

Advertisement

Next Story