సూయిజ్ కాలువలో జపాన్ నౌక అడ్డు ప్రభావం భారత్‌పై పడనుందా..?

by Shamantha N |
suez canal
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతి పెద్ద సరుకు రవాణా నౌక ‘ఎంవీ ఎవర్‌గివెన్’ ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కుంటున్నాయి. 400 మీటర్ల పొడువున్న ఈ జపాన్ నౌక 2.20 లక్షల టన్నులతో ప్రయాణిస్తుంది. ఈ నెల 23న ఈ నౌక కాలువలో అడ్డుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత్‌పై కూడా ఈ ప్రభావం ఉండనున్నది.

ఎవర్‌గివెన్ నౌక అడ్డుగా ఉండటంతో కెనాల్‌కు నార్త్, సౌత్ వైపునకు ఉన్న 240 సరుకు రవాణా నౌకలు నిలిచిపోయాయి. ఇందులో భారత నౌకలు రెండు ఉన్నాయి. ఎవర్‌గివెన్‌ను అక్కడ్నుంచి తొలగించడానికి ఇంకొద్ది రోజులు పట్టే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో దీనికి ఇరువైపులా నిలిచిపోయే నౌకల సంఖ్య 350కి పెరిగే అవకాశం ఉంది. దీంతో ఐరోపా దేశాలు, అమెరికాలో చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతి కోసం అమెరికా ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నది. అయితే చమురు దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ కూడా ఉంది. కానీ భారత్‌కు ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచే పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. అయినా ఇది ఎక్కువ రోజులు కొనసాగితే భారత్‌లో ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగకపోయే అవకాశం లేకపోలేదు.

పెట్రోలియం ఉత్పత్తుల మీద దీని ప్రభావం ఇప్పటికైతే పెద్దగా లేకపోయినా మిగిలిన వాటి మీద కచ్చితంగా పడే అవకాశం ఉంది. యూరప్ దేశాల నుంచి భారత్ ఆర్గానిక్ కెమికల్స్, ఐరన్ అండ్ స్టీల్, ఆటో మొబైల్స్, యంత్ర పరికరాలు, టెక్స్‌టైల్స్, హ్యాండీ క్రాఫ్ట్స్, ఫర్నీచర్ వంటివి దిగుమతి చేసుకుంటున్నది. అయితే ఉన్నట్టుండి ఎవర్‌గివెన్ సూయిజ్‌లో అడ్డం తిరగడంతో వీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం సరుకు రవాణా రేట్లను గతంలో కాంట్రాక్టు చేసుకున్న విధంగానే ఉంచాలని షిప్పింగ్ యార్డులను అభ్యర్థిస్తున్నది. సంక్షోభ కాలంలో సరుకుల రేట్లను పెంచకూడదని, త్వరగా పాడైపోయే ఉత్పత్తులేమైనా ఉంటే ఇతర మార్గాల ద్వారా తీసుకురావాలని యోచిస్తున్నది. సూయిజ్ కాలువ బ్లాక్ అయిన నేపథ్యంలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ (దక్షిణాఫ్రికా) ద్వారా అయినా సరుకు ఓడలను రప్పించాలని భావిస్తున్నది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, షిప్పింగ్ డిపార్ట్‌మెంట్ విభాగాలు సమీక్షలు నిర్వహించాయి.

Advertisement

Next Story

Most Viewed