ప్రభుత్వానికి ఆదాయం మొదలైంది!

by Shyam |
ప్రభుత్వానికి ఆదాయం మొదలైంది!
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రవాణా శాఖ ఆదాయం మెల్లమెల్లగా పుంజుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వాహన షోరూములు తెరచుకున్నప్పటి నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో సందడి పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ‌లలో 660 కొత్త వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్‌లతో కలిపి ఒక్కరోజే మొత్తం 6825 లావాదేవీలు జరిగాయి. వీటన్నింటి ద్వారా రూ.4కోట్ల 83 లక్షల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. దీనిలో రూ.2 కోట్ల 32 లక్షలు కేవలం ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన లైఫ్ ట్యాక్సే కావడం గమనార్హం. ఇవి కాక త్రైమాసిక పన్ను కోటి 30 లక్షల రూపాయలు, ఇతర ఫీజులు, చార్జీలు కలిపి రూ. కోటి 9 లక్షల రూపాయల దాకా వసూలైంది.

లాక్‌డౌన్ రెండో దశ ముగియగానే ఇచ్చిన సడలింపుల్లోనే రాష్ట్రంలో ఆర్టీఏ కార్యాలయాలు తెరచుకున్నప్పటకీ వాహన షోరూములు మూసి ఉండడంతో రవాణా శాఖకు పెద్దగా ఆదాయం సమకూరలేదు. అయితే తాజాగా ప్రభుత్వమిచ్చిన పూర్తిస్థాయి సడలింపుల్లో భాగంగా షోరూములు తెరచుకోవడంతో వాహన అమ్మకాలు ప్రారంభమై ఆర్టీఏల్లో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. తాజా సడలింపులతో రాష్ట్రంలో చాలా వరకు యాక్టివిటీ ప్రారంభమవడంతో రాష్ట్రంలోని ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలు దాదాపుగా రోడ్డెక్కాయి. దీంతో రవాణా శాఖకు త్రైమాసిక రోడ్డు పన్ను అధికంగా జమవడం ప్రారంభమయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఏల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి పకడ్బంది చర్యలు తీసుకొని ప్రజలకు సేవలందిస్తున్నట్టు రవాణా‌శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed