లాభాలు కావాలా నాయనా..? అయితే ఇది తెలుసుకో

by Anukaran |   ( Updated:2020-07-17 20:45:34.0  )
లాభాలు కావాలా నాయనా..? అయితే ఇది తెలుసుకో
X

దిశ, కాటారం: పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లో నీరు చేరుతోంది. చేప పిల్లలను వదిలేందుకు ఇక సమయం ఆసన్నమైంది. అయితే చేప పిల్లల ఎంపికలో మెళకువలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మంచి రకాలు, నీటిలో విడిచే విధానం తదితర అంశాలపై అవగాహన ఉంటే అధిక లాభాలు సాధించవచ్చు. చేపలకు సంక్రమించే వ్యాధుల నివారణ, అనుబంధ ఆహారం విషయంలో మెళకువలు తీసుకోవాలి. చేప పిల్లల పెంపకంతో పాటు నిల్వ చేయడంపై అవగాహన ఉండాలి. రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. చేపల పెంపకంపై సదస్సులకు హాజరై మత్స్యకారులు అవగాహన పెంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఏ చేపలు వదలాలి?

చెరువులో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే చేప పిల్లలు వదలాలి. సీడ్​ ఎంపికలో మెళకువలు పాటించాలి. చేపల్లో బొచ్చ, రవు, బంగారు తీగ, వెండిచేప, గడ్డిచేప, కొర్ర మీను లాంటివి ముఖ్యమైనవి. ఒక అంగుళం కంటే ఎక్కువ సైజు నుంచి 2–4 అంగుళాల వరకు ఇవి లభిస్తాయి. వీలైనంత వరకు పెంపకానికి ఫింగర్​ లింగ్ష్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వీటికి జీవితకాల ప్రమాణం అధికంగా ఉంటుంది. చేప పిల్లల పెరుగుదల నీటి నిల్వ, స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. చెరువులో నీరు శుభ్రంగా సమృద్ధిగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరు నెలలు మాత్రమే చెరువులో నీటి వనరులుంటే బొచ్చ, బంగారు తీగ, చేప పిల్లలను 1:1 నిష్పత్తిలో వదలాలి. 7–10 నెలలు, 12 నెలలు నీళ్లు ఉంటే చెరువుల్లో బొచ్చ, రవులు, బంగారు తీగ రకాలను 2:4:3 నిష్పత్తిలో వదలాలి. కృత్రిమ ఆహారం ఇచ్చే చెరువుల్లో పై మూడు రకాలను 3:5:2 నిష్పత్తిలో వదలాలి.

చేప పిల్లలు ఎట్లుండాలి..?

ఆరోగ్యవంతమైన చేప పిల్లలను ఎంపిక చేసుకోవాలి. చేపపిల్ల శరీరంపై మచ్చలు, కురుపులు లేని వాటినే ఎంచుకోవాలి. మొప్పలు లేత గులాబీ రంగులో ఉండాలి. వాజాలు (పిన్స్) విరిగిపోయినట్లు, కత్తిరించినట్లు ఉండొద్దు. పిల్ల ప్రకాశవంతంగా ఉండి చురుకుగా కదులుతూ ఉండాలి. పొలుసులు ఊడిపోయి మందకోడిగా ఉండొద్దు. ఎంపిక చేసుకునే పిల్లలు సమాన సైజుల్లో ఉండేలా చూసుకోవాలి. మత్స్యకారుల సొసైటీ సబ్సిడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ చేపపిల్లల కేంద్రాల్లో 100- 200 గ్రాముల బరువు గల ఇయర్​రింగ్స్ చేప పిల్లలు లభిస్తాయి. ఇది పెంపకానికి ఎంతో మేలైనవి. చేప పిల్లలను తీసుకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో రవాణా చేయాలి. కవర్లలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా నీటిని పోసి తేవాలి. చెరువు నీటికి 15–20 నిమిషాల పాటు అలవాటు చేసి నెమ్మదిగా వదలాలి. అలా కాకుండా ఆతృతతో వేగంగా ఎత్తునుంచి పోస్తే చేప పిల్లలు ఒత్తిడికిలోనై చనిపోయే ప్రమాదం ఉంది.

దాణా ముఖ్యమే..

చెరువులు, కుంటల్లో చేపల ఎదుగుదల.. వాటికి లభించే ఆహారంపై ఉంటుంది. సంఖ్యను బట్టి తిండి వేయాలి. లేకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కృత్రిమ ఆహారం, ఎరువులు వేసే చెరువుల్లో ఎకరా నీటి విస్తీర్ణానికి 2,000 -2,500 చేప పిల్లలను వదలాలి. అవి లేకుండా చెరువుల్లో 1,000-1,500 చేప పిల్లలు మాత్రమే వేసుకోవాలి. ఈ సంఖ్య తక్కువైనా ఎక్కువైనా లాభదాయకం కాదని గుర్తుంచుకోవాలి. ఒకే రకం చేప పిల్లలు కాకుండా వివిధ రకాల చేప పిల్లలను పెంచడం అన్ని విధాలా శ్రేయస్కరం.

Advertisement

Next Story

Most Viewed