జేసీ కేసులో ఏం జరిగింది?

by srinivas |
జేసీ కేసులో ఏం జరిగింది?
X

దిశ ఏపీ బ్యూరో: నకిలీ పత్రాలతో లారీలను అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని శనివారం ఉదయం హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ అనంతపురానికి తరలించారు. నకిలీ పత్రాలను సృష్టించి బీఎస్ఈ-3 వాహనాలను బీఎస్ఈ-4 వాహనాలుగా కన్వర్ట్ చేసి 160 లారీలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. వాహనాలకు బీమా కూడా చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ లారీలను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే విక్రయించేశారు. ఈ విషయమై అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులపై 12 కేసులు నమోదయ్యాయి. తాడిపత్రిలో మరో 17, కర్నూలు జిల్లాలో మరో మూడు కేసులు కూడా ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు కావడంతో ఆయా జిల్లాలో దాదాపు 63 లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

ఇటీవల అనంతపురంలో నాలుగు లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. వాటి రిజిస్ట్రేన్ పత్రాలను తనిఖీ చేయగా బీఎస్-3 పత్రాలను నకిలీ ఎన్‌ఓసీలతో బీఎస్-4 వాహనాలుగా కన్వర్ట్ చేసి తిప్పుతున్నట్టు గుర్తించారు. ఈ కేసులో లారీల యజమానులను అదుపులోకి తీసుకొని విచారించగా జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లారీలు సీజ్ కావడంతో లారీల కొనుగోలుదారులు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళన చేశారు. దీంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుదీర్ఘకాలంగా ట్రావెల్స్ రంగంలో ఉన్న జేసీ బ్రదర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దివాకర్ ట్రావెల్స్ పేరిట బస్సులు నడిపేది. ఈ క్రమంలో అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తుక్కు కింద విక్రయించిన వాహనాలను సేకరించిన తాడిపత్రికి చెందిన జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ వాటికి నకిలీ పత్రాలు సృష్టించి 2018లో వాటిని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పతున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో ఆ 68 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని, ఈ ఏడాది జనవరి 10న అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి మెయిల్‌ చేయగా, అన్ని అంశాలను పరిశీలించిన కంపెనీ అదే నెల 23న అంటే, ఈ ఏడాది జనవరి 23వ తేదీన పూర్తి వివరాలు పంపించింది.

బీఎస్‌–4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలను ఏప్రిల్‌ 1, 2017 నుంచి విక్రయించరాదని, అదే విధంగా ఆరోజు నుంచి వాటికి ఎక్కడా రిజిస్ట్రేషన్‌ చేయొద్దని సుప్రీంకోర్టు మార్చి 29, 2017న ఆదేశాలు జారీ చేసింది. బీఎస్‌–4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలు ఒకవేళ మార్చి 31, 2017 నాటికి విక్రయించి ఉంటే, వాటి రిజిస్ట్రేషన్‌కు మాత్రం కోర్టు మినహాయింపు ఇచ్చింది. దీనిని ఆధారంగా చేసుకుని జేసీ బ్రదర్స్ చక్రం తిప్పారని రవాణా శాఖ చెబుతోంది. కాలం చెల్లిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తెలిపింది.

జఠాధర ఇండస్ట్రీస్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డికి చెందింది కాగా, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్‌రెడ్డికి చెందినది కావడం విశేషం. జనవరి 23న మెయిల్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రవాణా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా, ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్‌ చేయించిన తర్వాత ఎన్‌ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించినట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి పూర్తి సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల వివరాలు సేకరించింది.

ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోరుతూ, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ తరపున జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన జేసీ ఉమాదేవి దరఖాస్తుపై సంతకం చేశారు. ఆ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఉత్తరాఖండ్‌లోని కళ్యాణ్‌పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్‌ లేలాండ్‌ కంపెనీలు ఇచ్చిన ఇన్‌వాయిస్‌లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. అంతే కాకుండా అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఇచ్చిన ఇన్‌వాయిస్‌లను అసంపూర్తిగా సమర్పించిన ఈ రెండు కంపెనీలు, తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్‌ పొందడం విశేషం. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి, ట్యాక్సులు తక్కువగా ఉంటాయని అక్కడే రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం వాటిని ఏపీకి తరలించి, ఎన్ఓసీలు పొంది. అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని యథేచ్ఛగా ఏపీలో నడిపారు.

జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీలపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. తుక్కు కింద బీఎస్‌–3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ మరో 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది. వాటికి కూడా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నాయంటూ, బీఎస్‌–4 ప్రమాణాలతో కూడి ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వాటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ పేర్ల మీదే కాకుండా, కొన్ని వాహనాలను వ్యక్తిగత పేర్లతోనూ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆయా వాహనాల ఛాసిస్‌ నెంబర్లను పరిశీలించగా, అన్నీ బీఎస్‌–3కు చెందినవే తప్ప, బీఎస్‌–4 ప్రమాణాలతో కూడినవి కావని తేలింది. ఇదే విషయాన్ని అశోక్‌ లీలాండ్‌ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధారించారు.

ఈ 154 వాహనాల్లో 101 వాహనాలు ఏపీలోనే రిజిస్టర్‌ అయ్యాయి. దీంతో వాటికి సంబంధించి మరే లావాదేవీ జరగకుండా రవాణాశాఖాదికారులు డేటా బేస్‌ బ్లాక్‌ చేశారు. 28 వాహనాలను ఇప్పటికే ఎన్‌ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించినట్టు గుర్తించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించారు. ఇంకా మిగిలిన వాహనాలను ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. రాష్ట్రంలో నమోదై ఉన్న 101 వాహనాల్లో 89 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. వాటిలో అనంతపురం జిల్లాలో 77 వాహనాలు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 5 చొప్పున, గుంటూరు జిల్లాలో మరో 2 వాహనాలు ఉన్నాయి. మిగిలిన వాహనాలకు సంబంధించి ఆర్‌సీ రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో 6 వాహనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. అందువల్ల వాటి ఆర్‌సీ రద్దు చేయాలంటే హైకోర్టు అనుమతి కావాలి. అందుకే అధికారులు వేచి చూస్తున్నారు. ఇంకా కడప జిల్లాలో 3 వాహనాలు, అనంతపురం జిల్లాలో మరో 3 వాహనాల ఆర్‌సీలు రద్దు చేయాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed