జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌లో వాటా కొన్న ఎస్‌బీఐ!

by Harish |
జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌లో వాటా కొన్న ఎస్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సిమెంట్ తయారీ దిగ్గజ సంస్థ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌లో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. కంపెనీలో కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్) రూపంలో బ్యాంకింగ్ దిగ్గజం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా కంపెనీ భవిష్యత్తు వ్యాపార పనితీరుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొంది. ఐపీఓకు రావాలని భావిస్తున్న జేఎస్‌డబ్ల్యూ నిర్ణయానికి ఎస్‌బీఐ ఇన్వెస్ట్‌మెంట్‌తో మరింత విలువను అందిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది కాలంలో కంపెనీ తన సామర్థ్యాన్ని ఏడాదికి 60 లక్షల టన్నుల నుంచి 1.4 కోట్ల టన్నులకు పెరిగింది.

తాజా నిధులను ఉపయోగించి కంపెనీ తన సామర్థ్యాన్ని ఏడాదికి ప్రస్తుతం ఉన్న 1.4 కోట్ల టన్నుల కెపాసిటీని 2.5 కోట్ల టన్నులకు పెంచేందుకు మద్దతు లభించిందని, ఈ సామర్థ్యాన్ని రెండేళ్లలో సాధించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడిన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్.. కేవలం మూడేళ్ల స్వల్ప వ్యవధిలో తాము ఏడాదికి 60 లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 1.4 కోట్ల టన్నులకు చేరుకున్నాం. రాబోయే రెండేళ్లలో సైతం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామని చెప్పారు. ఎస్‌బీఐ లాంటి బ్యాంకింగ్ దిగ్గజంతో భాగస్వామయం కంపెనీ వృద్ధి, విస్తరణ వ్యూహానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనివల్ల రాబోయే 12-18 నెలల్లోగా కంపెనీ ఐపీఓకు మార్గం సుగుమం అయిందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఫైనాన్స్ డైరెక్టర్ నరీందర్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed