'అంతటా రసాయనాలే.. ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందట్లేదు'

by Shyam |   ( Updated:2021-05-12 09:52:57.0  )
అంతటా రసాయనాలే.. ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందట్లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మార్కెట్లో అంతటా రసాయనిక మందులతో కూడిన ఆహారమే లభిస్తోందని, ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందట్లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజలంతా క్రమంగా సేంద్రియ ఉత్పత్తుల వైపు అడుగులేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సేంద్రీయ ఎరువుల వినియోగం(సిటీ కంపోస్ట్)పై వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాములు, రాంకీ వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థ ఎండీ గౌతం రెడ్డి, భవాని ఆర్గానిక్స్ ఎండీ రమేశ్ తో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూరగాయలు, పండ్లు అన్నింట్లో రసాయన అవశేషాలు ఉంటున్నాయని, పూర్వం ఈ రసాయనాలు లేని ఆహారం తినడం మూలంగా మన పెద్దలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సుదీర్ఘకాలం జీవించారని పేర్కొన్నారు.

రాబోయే తరాలకు నాణ్యమైన ఆహారం అందించడం మన బాధ్యతని ఆయన చెప్పారు. అగ్రోస్ సంస్థ సిటీ కంపోస్ట్ సేంద్రియ ఎరువును రైతులు ఎక్కువగా వినియోగించేలా చూడాలని ఆయన వారిని ఆదేశించారు. దీని వినియోగంపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ ఎరువులు భూసారాన్ని గణనీయంగా పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఇతర సేంద్రియ ఎరువులైన వర్మి కంపోస్ట్, పచ్చి రొట్ట, పశువుల ఎరువులతో పాటు ఈ సిటీ కంపోస్ట్ ఎరువును వాడితే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఎరువులను ఉపయోగించి ప్రచారం కల్పించాలన్నారు. అంతేకాకుండా సబ్సిడీపై అందించేలా ప్రయత్నించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.

క్రిభ్ కో, కోరమాండల్ వంటి కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మూలంగా అగ్రోస్ కన్నా తక్కువ ధరకు అందిస్తున్నారని ఆయన తెలిపారు. పెద్ద రైతులకు ప్యాకింగ్ లేకుండా నేరుగా పంపించడం మూలంగా సంస్థకు ప్యాకింగ్ ఖర్చు, రైతుకు బస్తాలను అన్ లోడ్ చేసే ఖర్చు తగ్గుతుందని ఆయన వివరించారు. ఉద్యాన రైతులను ప్రోత్సహించాలని మంత్రి వారికి ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed