కెప్టెన్‌గా గిల్‌కు తొలి పరీక్ష.. రేపే జింబాబ్వేతో తొలి టీ20

by Harish |
కెప్టెన్‌గా గిల్‌కు తొలి పరీక్ష.. రేపే జింబాబ్వేతో తొలి టీ20
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్‌ టైటిల్‌తో స్వదేశంలో అడుగుపెట్టడంతో దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు, కుర్రాళ్లు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమయ్యారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రేపు తొలి టీ20. ఈ పర్యటనకు సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువకులను పంపించారు. ఈ యువ భారత్‌ను శుభ్‌మన్ గిల్ నడిపించబోతున్నాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గిల్‌కు ఇదే తొలిసారి. మరి, సారథిగా అతను తనదైన ముద్ర వేస్తాడో లేదో చూడాలి.

గిల్‌కు కీలకం

ఈ టూరు గిల్ కెప్టెన్సీకి పరీక్షే అని చెప్పొచ్చు. టీ20లకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త టీ20 కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. సారథి రేసులో గిల్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పాండ్యాకు పగ్గాలు అప్పగించినా.. ఈ టూరులో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేస్తే వైస్ కెప్టెన్సీ కట్టబెట్టే చాన్స్ ఉంది. కాబట్టి, ఈ పర్యటన గిల్‌కు కీలకం కానుంది. భారత జట్టును నడిపించడం అతనికి ఇదే తొలిసారి. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో గుజరాత్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు పొందింది. ఏడింట ఓటమిపాలైంది.

అరంగేట్రం చేసేదెవరో?

బ్యాటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, బౌలర్లు హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ నలుగురు సత్తాచాటారు. గిల్‌తో కలిసి అభిషేక్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అతనికి రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ నుంచి పోటీ తప్పదు. గైక్వాడ్ ఓపెనర్‌గా రాకపోతే ఫస్ట్ డౌన్‌లో దిగొచ్చు. మిడిలార్డర్‌లో రియాన్ పరాగ్‌కు చోటు ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్ దళంలో పోటీ నేపథ్యంలో హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే అరంగేట్రంపై అనుమానాలు నెలకొన్నాయి.

ప్రత్యర్థిలో వీళ్లు

ఏ రకంగా చూసుకున్నా జింబాబ్వే భారత్ విజయం నల్లేరు మీద నడకే. కానీ, జింబాబ్వేను పసికూనే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇటీవల ఆ జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు షాకిచ్చింది. ఆ జట్టు కూడా యువకులతోనే బరిలోకి దిగనుంది. కెప్టెన్, ఆల్‌రౌండర్ సికందర్ రజా జింబాబ్వే ప్రధాన బలం. మరో ఆల్‌రౌండర్ బ్రియాన్ బెన్నెట్ బ్యాటు, బంతితో ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్లలో ముజారబానీ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నాడు. లూక్ జోంగ్వే, రిచార్డ్ నగరవ సైతం ఇబ్బంది పెట్టగలరు.

భారత్ 6.. జింబాబ్వే 2

టీ20ల్లో భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 8సార్లు ఎదురుపడ్డాయి. అందుల్లో ఆరు విజయాలతో భారత్‌దే ఆధిపత్యం. జింబాబ్వే రెండింట నెగ్గింది. చివరిసారిగా టీ20 వరల్డ్ కప్‌-2022లో ఇరు జట్లు తలపడగా టీమిండియానే గెలుపొందింది.

పిచ్ రిపోర్టు

హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. పిచ్ ఉపరితలం గట్టిగా ఉండటంతో బంతి బౌన్స్ అవుతూ బ్యాటుపైకి వస్తుంది. ఇది బ్యాటర్లకు సహాయపడనుంది. మిడిల్ ఓవర్లలో బౌలర్లు ప్రభావం చూపనున్నారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఈ స్టేడియంలో 44 టీ20 మ్యాచ్‌లు జరగగా.. అందులో 25 మ్యాచ్‌ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. చేజింగ్ జట్లు 19 సందర్భాల్లో నెగ్గాయి.

తుది జట్లు(అంచనా)

భారత్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.

జింబాబ్వే : ఇన్నోసెంట్ కైయా, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధేవెరే, క్లైవ్ మదాండే, లూక్ జోంగ్వే, వెల్లింగ్టన్, ముజారబానీ, టైండై చతారా, రిచార్డ్ నగరవ.

Advertisement

Next Story