రేపు డబ్ల్యూపీఎల్ ఫైనల్.. తొలి టైటిల్‌పై కన్నేసిన బెంగళూరు, ఢిల్లీ

by Harish |
రేపు డబ్ల్యూపీఎల్ ఫైనల్.. తొలి టైటిల్‌పై కన్నేసిన బెంగళూరు, ఢిల్లీ
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2 టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆఖరి సమరానికి సై అంటున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మరి, టైటిల్ ఎగరేసుకుపోయిది ఎవరో?.. ఎవరూ గెలిచినా వారికి ఇదే తొలి టైటిల్ కానుంది.

ఢిల్లీకి మరో చాన్స్

డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశం ఢిల్లీకి మరోసారి దక్కింది. ఆరంభ సీజన్‌లోనే ఆ జట్టు ఫైనల్‌కు చేరినా ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ సారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలన్న కసితో బరిలోకి దిగిన ఆ జట్టు సత్తాచాటింది. లీగ్ దశలో 8 మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గి టేబుల్ టాపర్‌గా నిలవడంతోపాటు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ బ్యాటింగ్ దళం చాలా పటిష్టంగా ఉంది. కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, ఎలీస్ క్యాప్సే, రోడ్రిగ్స్‌ భీకర ఫామ్‌లో ఉండటం ఆ జట్టు ప్రధాన బలం. వీరిలో ఎవరూ క్రీజులో పాతుకపోయిన ఆర్సీబీ బౌలర్లకు తిప్పలు తప్పవు. టాప్-10 బ్యాటర్లలో ఈ నలుగురు ఉండటాన్ని బట్టి టోర్నీలో వీరి దూకుడును అర్థం చేసుకోవచ్చు. అయితే, టాప్-4 తర్వాత జట్టును ఆదుకునేలా ఎవరు లేకపోవడం ఢిల్లీ బలహీనత. బౌలింగ్ పరంగా కూడా ఢిల్లీ బలంగా ఉంది. మారిజన్నె కాప్, జొనాస్సెన్, రాధా యాదవ్ ఆ జట్టు బౌలింగ్ దళంలో కీలకం. వీరికితోడు అరుంధతి రెడ్డి, శిఖా పాండే కూడా ఫామ్‌లో ఉండటం బెంగళూరు బ్యాటర్లను ఇబ్బంది పెట్టనుంది. మరోవైపు, బెంగళూరు చేతిలో ఇప్పటివరకు ఓడిన దాఖలాలు లేకపోవడం ఢిల్లీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.

బెంగళూరు ఏం చేస్తుందో?

గత సీజన్‌లో గ్రూపు దశలోనే ఎలిమినేట్ అయిన బెంగళూరు ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. గ్రూపు దశలో 8 మ్యాచ్‌ల్లో నాలుగింట నెగ్గి మూడో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో ముంబైపై అద్భుత విజయం సాధించి తొలిసారిగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. అదే పోరాట పటిమను ఫైనల్‌ల్లోనూ ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. రెండు సీజన్లలో కలుపుకుని ఢిల్లీతో బెంగళూరు నాలుగుసార్లు తలపడగా ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఇది ఆర్సీబీ ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతేసేదే. కాబట్టి, ఆ జట్టు సమిష్టిగా రాణించాల్సి ఉంది. కెప్టెన్ స్మృతి మంధాన, ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్‌లపైనే బ్యాటింగ్ దళం ఆధారపడి ఉన్నది. స్మృతి మంధాన నిలకడ లేమి జట్టుకు సమస్యగా మారింది. సబ్బినేని మేఘన, సోఫి డివైన్‌లతోపాటు మోలినెక్స్, వారేహమ్ నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నది. బౌలింగ్ దళంలో ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, మోనిలినెక్స్‌లపై జట్టు నమ్మకంగా ఉంది.

ఇరు జట్లకు ఆ చాన్స్ కూడా

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడం ద్వారా బెంగళూరు, ఢిల్లీ జట్లకు మరో కల కూడా నెరవేరే అవకాశం ఉంది. ఈ జట్లకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే ఓనర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలువలేదు. ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్లో ఓడిపోయింది. 2020లో ఢిల్లీ టైటిల్ పోరుకు అర్హత సాధించినా భంగపాటు తప్పలేదు. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా టైటిల్ నిరీక్షణకు తెరదించే అవకాశం ఇరు జట్లకు దక్కింది. మరి, ఏ జట్టూ ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

ఎక్కడ చూడొచ్చంటే?

ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే, జియో సినిమా యాప్‌లోనూ వీక్షించొచ్చు.

తుది జట్లు(అంచనా)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన(కెప్టెన్), సొఫి డివైన్, సోఫి మోలినెక్స్, ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, వారేహమ్, దిశా కసత్/సబ్బినేని మేఘన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా, రేణుక సింగ్.

ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్(కెప్టెన్), షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, ఎలీస్ క్యాప్సే, మారిజన్నె కాప్, జొనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, మిన్ను మని.

Advertisement

Next Story

Most Viewed