Virender Sehwag: 'కోచ్‌ నన్ను కొట్టాడు'.. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్ సంచలన ఆరోపణలు

by Vinod kumar |
Virender Sehwag: కోచ్‌ నన్ను కొట్టాడు.. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. 2002 నాట్‌వెస్ట్‌ ట్రోఫీ సందర్భంగా నాటి భారత హెడ్‌ కోచ్‌ జాన్‌ రైట్‌ తనను కాలర్‌ పట్టుకుని, చైర్‌ పైకి తోసేశాడని సెహ్వాగ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో తొందరగా ఔటవ్వడంతో రైట్‌ తనపై ఇలా అమానవీయంగా వ్యవహరించాడని గుర్తు చేసుకున్నాడు. ఆ సందర్భంలో తనకు పట్టలేని కోపం వచ్చిందని.. ఓ తెల్లోడు మనంపై పెత్తనం చేయడమేంటని జట్టు సభ్యులందరినీ ప్రశ్నించానని.. అయితే నాటి టీమ్‌ మేనేజర్‌ జోక్యంతో తన కోపం చల్లారిందని ఇటీవల జరిగిన ఓ బుక్‌ లాంచింగ్‌ ప్రోగ్రాం సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయం బయటికి పొక్క కూడదని నాటి భారత బృందం సభ్యులు సచిన్‌కు మాట ఇచ్చారని, అందుకే ఎవరికీ తెలియ లేదన్నారు.

ఇలాంటి ఘటనే ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగితే పెద్ద రాద్దాంతం అవుతుందని.. ఓ విదేశీ కోచ్‌ అలా చేస్తే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపాడు. కాగా, నాటి నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌.. ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్‌ గెలిచింది. ఫైనల్లో మహ్మద్‌ కైఫ్‌ (87), యువరాజ్‌ సింగ్‌ (69) వీరోచితంగా పోరాడి టీమిండియాను గెలిపించారు. కైఫ్‌ విన్నింగ్‌ షాట్‌ కొట్టాక నాటి భారత కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చొక్కా విప్పి చేసుకున్న సెలబ్రేషన్స్‌ ఎప్పటికీ భారత అభిమానులు కళ్ల ముందే మెదులుతూ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed