టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌తో కలిసి క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని..

by Vinod kumar |   ( Updated:2023-10-10 11:15:43.0  )
టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌తో కలిసి క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌తో సరదాగా క్రికెట్ ఆడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన జోస్ బట్లర్‌తో పాటుగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సామ్ కరన్, డేవిడ్ మలన్, ఫిల్ సాల్ట్, మిల్స్, క్రిస్ జోర్డాన్ లు రిషి సునక్ ఉంటున్న 10 డౌనింగ్స్ స్ట్రీట్‌కు హాజరయ్యారు. తన అధికారిక నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారితో కాసేపు ముచ్చటించిన రిషి సునక్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడారు. ముందు బ్యాటింగ్ చేసిన సునక్.. ఫ్రొఫెషనల్ క్రికెటర్ మాదిరిగా బ్యాటింగ్ చేశారు. తాను ఆడిన తొలి బంతిని డిఫెన్స్ చేసిన ఆయన.. రెండో బంతిని కవర్ డ్రైవ్ షాట్ ఆడారు.

సామ్ కరన్ వేసిన బంతిని కూడా స్లిప్స్ వైపునకు తరలించారు. కానీ క్రిస్ జోర్డాన్ వేసిన బంతిని అలాగే ఆడబోయి స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చారు. బ్యాటింగ్ చేసిన తర్వాత బంతి పట్టిన సునక్.. సామ్ కరన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీశాక ప్రధాని.. క్రికెటర్ల మాదిరిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారుతోంది.

గతేడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) వేదికగా ఇంగ్లాండ్-పాకిస్తాన్ ఢీకొనగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. 19 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి రెండో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed