సింగపూర్ ఓపెన్ : సెమీస్‌లో ముగిసిన గాయత్రి జోడీ పోరాటం

by Harish |
సింగపూర్ ఓపెన్ : సెమీస్‌లో ముగిసిన గాయత్రి జోడీ పోరాటం
X

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్‌లో వరల్డ్ నం.2, వరల్డ్.6 జంటలను ఓడించి సంచలనం సృష్టించిన ఈ జోడీ సెమీస్‌లో ఇంటిదారిపట్టింది. శనివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో గాయత్రి జోడీ 23-21, 21-11 తేడాతో 4వ సీడ్ జపాన్‌కు చెందిన నమీ మత్సుయమ-చిహారు షిడా ద్వయం చేతిలో పరాజయం పాలైంది.

తొలి గేమ్‌లో ఒక దశలో 8-2తో వెనుకబడిన గాయత్రి, ట్రీసా జాలీ ఆ తర్వాత పుంజుకున్నారు. వరుసగా పాయింట్లు నెగ్గి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చిన వారు 16-16తో స్కోరును సమం చేశారు. అయితే, 21-21తో సమంగా నిలిచిన సమయంలో జపాన్ జంట వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను గెలుచుకుంది. ఇక, రెండో గేమ్‌లో గాయత్రి, ట్రీసా జాలీ ప్రత్యర్థుల దూకుడును నిలువరించలేక గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కోల్పోయారు. సెమీస్‌లో గాయత్రి జోడీ నిష్ర్కమణతో ఈ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. ఇప్పటికే సింగిల్స్‌లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్‌లతోపాటు పురుషుల డబుల్స్ స్టార్లు సాత్విక్, చిరాగ్ శెట్టి కూడా ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story