MP Raghunandan Rao : తెలుగు సంస్కృతికి ప్రతిరూపం కూచిపూడి

by Kalyani |
MP Raghunandan Rao : తెలుగు సంస్కృతికి ప్రతిరూపం కూచిపూడి
X

దిశ, పటాన్ చెరు: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే కళాత్మక నృత్య రూపం కూచిపూడి తెలుగు సంస్కృతికి ప్రతిరూపమని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు (Mp Raghunandan Rao)అన్నారు. వరల్డ్ కూచిపూడి డాన్స్ డే సందర్భంగా బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున దేవాలయ ప్రాంగణంలో శ్రీ లంభోధర కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భవాని కూచిపూడి నర్తనశాల కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు(Mp Raghunandan Rao) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడానికి 108 మంది నృత్యకారిణీలతో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. 108 మంది బాలలతో కూచిపూడి నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భక్తితో తమ కళాత్మక నైపుణ్యంతో నృత్య ప్రదర్శన నిర్వహించిన చిన్నారులను ఆయన అభినందించారు.

తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి ప్రపంచాన్ని చుట్టేసిన శాస్త్రీయ నృత్య కళారూపాల్లో కూచిపూడి నృత్యానిది అగ్రస్థానమన్నారు. చిన్నారులకు కూచిపూడిలో తర్ఫీదు నుంచి వారిని నృత్యకారులు గా తీర్చిదిద్దిన గురువుల కృషి అమోఘమన్నారు. 108 మంది నృత్యకారిణి ల అభినయం, హావభావాలు చూపరులను కట్టిపడేశాయని అన్నారు. నిర్వాహకులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed