ఇంకోటి నెగ్గితే.. నో డౌట్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్!

by Vinod kumar |
ఇంకోటి నెగ్గితే.. నో డౌట్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్!
X

న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ దిశగా టీమ్ ఇండియా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు టెస్టులు నెగ్గి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 66.67 శాతం, 136 పాయింట్లతో ఫైనల్ బెర్త్‌‌‌ దక్కించుకునేందుకు ముందు వరుసలో ఉన్నది. టీమ్ ఇండియా 64.06 శాతం, 123 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. శ్రీలంక 53.33 శాతం, 64 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నది.

ఇందులో ఆసిస్‌కు ఫైనల్ బెర్త్ దాదాపు ఖరారే. ఇక, రెండో స్థానం కోసం టీమ్ ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులో భారత్ ఒక్కటి గెలిచినా 64.81 పర్సంటేజ్‌తో ఎలాంటి అడ్డంకులు లేకుండా రోహిత్ సేన ఫైనల్‌కు చేరుకుంది. ఒకవేళ మిగతా రెండు టెస్టుల్లో భారత్ ఓడి.. న్యూజిలాండ్‌పై 2-0తో శ్రీలంక టెస్టు సిరీస్‌ను గెలిస్తే మాత్రం బెర్త్ ఆశలు గల్లంతు కానున్నాయి.

అదే జరిగితే భారత్ 59.25 పర్సంటేజ్‌తో మూడో స్థానానికి పడిపోనుండగా.. 66.66 శాతం తో శ్రీలంక ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అయితే, కివీస్‌పై శ్రీలంక టెస్టు సిరీస్ సాధించడం అంత సులభమేమీ కాదు. కాబట్టి, భారత్ ఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఆస్ట్రేలియా మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. కివీస్‌పై శ్రీలంక నెగ్గితే ఆసిస్ ఫైనల్ బెర్త్ ప్రమాదంలో పడుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడబోయే జట్లపై ఐసీసీ రిలీజ్ చేసిన చాట్ ప్రకారం.. ఆస్ట్రేలియా, భారత్ తుదిపోరులో తలపడేందుకు 88.9 శాతం అవకాశం ఉంది. అలాగే, 8.3 శాతం తో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు , 2.8 శాతం తో భారత్, శ్రీలంక జట్లు ఫైనల్లో ఆడే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed