IND VS SL : రెండో వన్డేలో ఏం చేస్తారో?.. నేడు శ్రీలంకతో భారత్ ఢీ

by Harish |
IND VS SL : రెండో వన్డేలో ఏం చేస్తారో?.. నేడు శ్రీలంకతో భారత్ ఢీ
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భారత్‌కు అనూహ్య ఆరంభం ఎదురైంది. రోహిత్ సేన గెలిచే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయింది. అయితే, ఓటమి కూడా పొందలేదు. తొలి వన్డే టై అయిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేయగా.. ఛేదనకు దిగిన భారత్ కూడా 230 పరుగులకే ఆలౌటవడంతో మ్యాచ్ టై అయ్యింది. 14 బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన దశలో వరుస బంతుల్లో ఆఖరి రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేపై భారత జట్టు ఫోకస్ పెట్టింది. నేడు కొలంబో వేదికగానే రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ పట్టు సాధించాలని భావిస్తున్నది. రెండో వన్డే కోసం భారత తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు చోటు దక్కొచ్చు. టీ20 సిరీస్‌లో పరాగ్ బంతితో రాణించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో పరాగ్‌కు స్థానం కల్పించనున్నారు.

అలాగే, వికెట్ కీపర్ పంత్ ఈ మ్యాచ్ కూడా బెంచ్‌కే పరిమితం కానున్నాడు. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన రాహుల్‌నే టీమ్ మేనేజ్‌మెంట్ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిని బౌలర్లు మోస్తరు స్కోరుకే కట్టడి చేసినా.. బ్యాటర్లు రాణించకపోవడంతోనే భారత్ విజయం ముగింట ఆగిపోయింది. కెప్టెన్ రోహిత్(58) మాత్రమే రాణించగా.. రాహుల్(31), అక్షర్(33) పర్వాలేదనిపించారు. గిల్ నిరాశపర్చగా.., విరాట్, శ్రేయస్, శివమ్ దూబె తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. బౌలింగ్‌లో పేసర్ అర్ష్‌దీప్ నిలకడగా రాణిస్తుండగా.. సిరాజ్ నుంచి మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది. కుల్దీప్, అక్షర్, సుందర్ వంటి స్పిన్నర్లు మ్యాజిక్ చేయాల్సిందే.

Advertisement

Next Story