సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్.. అతనికే పగ్గాలు అప్పగించే చాన్స్?

by Harish |
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్.. అతనికే పగ్గాలు అప్పగించే చాన్స్?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 22 నుంచి లీగ్‌కు తెరలేవనుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎస్‌ఆర్‌హెచ్‌ పగ్గాలు చేపట్టనున్నట్టు సమాచారం. మినీ వేలంలో ఫ్రాంచైజీ కమిన్స్‌ను భారీ ధర రూ.20.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో మార్క్‌రమ్ సారథ్యంలో జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. పేలవ ప్రదర్శనను మూటగట్టుకుంది. మరోవైపు, గతేడాది కమిన్స్ ఆసిస్ జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్ అందించాడు. ఈ నేపథ్యంలోనే ఫ్రాంచైజీ మార్క్‌రమ్‌ను తప్పించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మార్క్‌రమ్ అక్కడ హిట్టు.. ఇక్కడ ఫట్టు

మార్క్‌రమ్ కెప్టెన్సీ ‘సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో హిట్టు.. ఐపీఎల్‌లో ఫట్టు’ అన్న చందంగా ఉంది. ఎస్‌ఏ20 లీగ్‌లో సన్ గ్రూపుకు చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టును మార్క్‌రమ్ వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు. గతేడాది ప్రారంభ సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపిన అతను.. ఇటీవల పూర్తయిన రెండో సీజన్‌లోనూ వరుసగా టైటిల్ అందించాడు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం అతని కెప్టెన్సీ మార్క్ కనిపించలేదు. గతేడాది మార్క్‌రమ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్‌ టీమ్‌ను ప్రారంభ సీజన్‌లోనే విజేతగా నిలబెట్టడంతో కేన్ విలియమ్సన్‌ను తప్పించి అతన్ని సారథిగా నియమించారు. అయితే, గత సీజన్‌లో అతని నాయకత్వంలో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. మార్క్‌రమ్ కెప్టెన్సీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మైదానంలో పలు నిర్ణయాలు గెలిచే మ్యాచ్‌ల్లో ఓటములకు దారితీశాయి. దీంతో మార్క్‌రమ్‌పై వేటు వేయాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్టు తెలిసింది.

కమిన్సే ఎందుకు?

జట్టులో మార్క్‌రమ్ కాకుండా భువనేశ్వర్, మయాంక్ అగర్వాల్ లాంటి సీనియర్లు ఉన్నారు. భువనేశ్వర్ గతంలో పలుమార్లు జట్టును నడిపించాడు. అలాగే, మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, ప్యాట్ కమిన్స్‌ వైపే ఫ్రాంచైజీ మొగ్గు చూపడానికి కారణాలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కమిన్స్ అద్భుత విజయాలు సాధించాడు. గతేడాది ఆసిస్‌కు తొలిసారిగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ అందించాడు. అంతేకాకుండా, గతేడాది భారతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో చాంపియన్‌గా నిలిపాడు. దీంతో సారథిగా అతని నైపుణ్యాలపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కెప్టెన్‌గానే కాకుండా అతను ప్లేయర్‌గానూ మైదానంలో ఆకట్టుకున్నాడు. బౌలర్‌గా అతని సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు. అయితే, బ్యాటింగ్ సామర్థ్యం కూడా అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. మరోవైపు, కమిన్స్‌కు పగ్గాలు అప్పగించాలనేది ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ప్రతిపాదనగా తెలుస్తోంది. వెట్టోరి ఆస్ట్రేలియాకు అసిస్టెంట్‌ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. వెట్టోరి, కమిన్స్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గతేడాది ఐపీఎల్-2024 వేలానికి ముందు వెట్టోరిని ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. వేలంలో కమిన్స్‌ కొనుగోలు విషయంలో వెట్టోరి కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి. కమిన్స్‌ను కెప్టెన్ కోణంలో ఆలోచించే ఫ్రాంచైజీ భారీ ధర పెట్టి కొనుగోలు చేసినట్టు అప్పుడే ప్రచారం కూడా జరిగింది.

Advertisement

Next Story