యూటర్న్ తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. రంజీ ట్రోఫీకి అందుబాటులోకి..

by Harish |
యూటర్న్ తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. రంజీ ట్రోఫీకి అందుబాటులోకి..
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ ఆడకపోవడంతో టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వెన్ను నొప్పితో అతను ఎన్‌సీఏలో చేరగా.. ఎన్‌సీఏ అతను ఫిట్‌గానే ఉన్నాడని సెలెక్టర్లకు మెయిల్ చేసినట్టు వార్తలు రావడంతో అయ్యర్‌పై విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ కోసమే అతను దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా అయ్యర్ యూటర్న్ తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబై తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. జాతీయ జట్టుకు ఆడని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో తమ రాష్ట్రం తరపున ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే సెమీస్‌లో తమిళనాడుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అయ్యర్ అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. ‘సెమీస్‌కు అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అయ్యర్ సమాచారం అందించాడు. తాను ఫిట్‌గా ఉన్నానని తెలిపాడు.’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, అయ్యర్ ఏడాది కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గతేడాది అతను సర్జరీ కూడా చేయించుకున్నాడు. గతేడాది ఆసియా కప్‌తో పునరాగమనం చేసినా వెన్ను నొప్పితో అడపాదడపా జట్టులోకి వస్తూ పోతున్నాడు. అలాగే, ఫామ్ లేమి కూడా అతనికి సమస్యగా మారింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 35, 13, 27, 29 పరుగులు చేశాడు. దీంతో మిగతా సిరీస్‌కు అతన్ని సెలెక్టర్లు తప్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed