- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెలరేగిన శివమ్ దూబె.. తొలి టీ20 భారత్‌దే
దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మొహాలి వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 158 పరుగులు చేసింది. మహ్మద్ నబీ(42, 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పరుగులు జోడించాడు. అక్షర్ పటేల్(2/23), ముకేశ్ కుమార్(2/33) సత్తాచాటారు. అనంతరం ఛేదనకు దిగిన టీమ్ ఇండియా 159 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 17.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శివమ్ దూబె(60 నాటౌట్, 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో భారత్ విజయం సునాయాసమైంది. జితేశ్ శర్మ(31) రాణించాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం ఇండోర్ వేదికగా రెండో టీ20 జరగనుంది.
సత్తాచాటిన శివమ్ దూబె
159 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(0) తొలి ఓవర్‌లోనే రనౌటయ్యాడు. దీంతో భారత్ ఖాతా తెరవకుముందే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(23) వరుస ఫోర్లతో అలరించాడు. అయితే, కాసేపటికే ముజీబ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 28 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన అతను అఫ్గాన్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. అజ్మతుల్లా బౌలింగ్‌లో తిలక్ వర్మ(26) వికెట్ పారేసుకోవడంతో ఈ జోడీకి తెరపడింది. తిలక్ అవుటైన తర్వాత దూబెకు జితేశ్ శర్మ(31) తోడయ్యాడు. అతను కాసేపే క్రీజులో ఉన్నా.. ఫోర్లతో చెలరేగి కీలక పరుగులు జోడించాడు. మరోవైపు, కీలక వికెట్లు తీస్తూ అఫ్గాన్ ఒత్తిడి పెంచినా దూబె మాత్రం దూకుడు ఆపలేదు. ఈ క్రమంలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో అతనికి ఇది రెండో అర్ధ సెంచరీ. శివమ్ దూబె(60 నాటౌట్)తోపాటు రింకు సింగ్(16 నాటౌట్) మెరవడంతో భారత్ విజయం లాంఛనమైంది. 18వ ఓవర్‌లో దూబె వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ 2 వికెట్లు తీయగా.. అజ్మతుల్లాకు ఒక్క వికెట్ దక్క్కింది.
అఫ్గాన్‌ను నిలబెట్టిన నబీ
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఓపెనర్లు గుర్బాజ్(23), ఇబ్రహీం జద్రాన్(25) శుభారంభం అందించారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను చక్కగా నడిపించింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. గుర్బాజ్‌ను అవుట్ చేసి ఓపెనింగ్ జోడీని విడదీశాడు. దీంతో అఫ్గాన్ 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వరుస ఓవర్‌లో రహమత్ షా(3)ను పెవిలియన్ పంపాడు. రహమత్ షా కంటే ముందు జద్రాన్‌ను శివమ్ దూబె అవుట్ చేశాడు. దీంతో 7 పరుగుల వ్యవధిలో అఫ్గాన్ మూడు వికెట్లు కోల్పోయి 57/3 స్కోరుతో కష్టాల్లో పడేలా కనిపించింది. ఈ పరిస్థితుల్లో మహ్మద్ నబీ(42) జట్టును ఆదుకున్నాడు. అజ్మతుల్లా(29) సహకారంతో దూకుడుగా ఆడిన అతను భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు, ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ వేగంగా కదలింది. అయితే, ముకేశ్ కుమార్ ఒకే ఓవర్‌లో అజ్మతుల్లాతోపాటు నబీని పెవిలియన్ పంపి ప్రత్యర్థికి షాకిచ్చాడు. అనంతరం నజీబుల్లా(19 నాటౌట్), కరీమ్ జనత్(9 నాటౌట్) ఆరో వికెట్‌కు 28 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో నిర్ణీత ఓవర్లలో అఫ్గాన్ జట్టు 158/5 స్కోరు చేసింది. భారత బౌలర్లలో ముకేశ్, అక్షర్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబె ఒక వికెట్ పడగొట్టాడు.
స్కోరుబోర్డు
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ : 158/5(20 ఓవర్లు)
గుర్బాజ్(స్టంప్)జితేశ్ శర్మ(బి)అక్షర్ 23, జద్రాన్(సి)రోహిత్(బి)శివమ్ దూబె 25, అజ్మతుల్లా అమర్జాయ్(బి)ముకేశ్ 29, రహమత్ షా(బి)అక్షర్ 3, మహ్మద్ నబీ(సి)రింకు సింగ్(బి)ముకేశ్ 42, నజీబుల్లా జద్రాన్ 19 నాటౌట్, కరీమ్ జనత్ 9 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.
వికెట్ల పతనం : 50-1, 50-2, 57-3, 125-4, 130-5
బౌలింగ్ : అర్ష్‌దీప్ సింగ్(4-1-28-0), ముకేశ్ కుమార్(4-0-33-2), అక్షర్ పటేల్(4-0-23-2), వాషింగ్టన్ సుందర్(3-0-27-0), శివమ్ దూబె(2-0-9-1), రవి బిష్ణోయ్(3-0-35-0)
భారత్ ఇన్నింగ్స్ : 159/4(17.3 ఓవర్లు)
రోహిత్ రనౌట్(జద్రాన్/గుర్బాజ్) 0, శుభ్‌మన్ గిల్(స్టంఫ్)గుర్బాజ్(బి)ముజీబ్ 23, తిలక్ వర్మ(సి)గుల్బాదిన్(బి)అజ్మతుల్లా 26, శివమ్ దూబె 60 నాటౌట్, జితేశ్ శర్మ(సి)జద్రాన్(బి)ముజీబ్ 31, రింకు సింగ్ 16 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3.
వికెట్ల పతనం : 0-1, 28-2, 72-3, 117-4
బౌలింగ్ : ఫజల్హాక్ ఫారూఖీ(3-0-26-0), ముజీబ్ ఉర్ రెహ్మాన్(4-1-21-2), మహ్మద్ నబీ(2-0-24-0), నవీన్ ఉల్ హక్(3.3-0-43-0), అజ్మతుల్లా ఒమర్జాయ్(4-0-33-1), గుల్బాదిన్(1-0-12-0)