రేపటి నుంచే మహిళల ధనాధన్.. తొలి మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ జట్లు ఢీ

by Harish |
రేపటి నుంచే మహిళల ధనాధన్.. తొలి మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ జట్లు ఢీ
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్).. గతేడాది ప్రారంభ సీజన్ సూపర్ హిట్. ఐపీఎల్‌కు ఏమాత్రం తగ్గకుండా మహిళా క్రికెటర్లు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. అదే ధనాధన్‌తో స్టేడియాలను హోరెత్తించేందుకు మహిళలు మరోసారి సిద్ధమయ్యారు. రేపటి నుంచే డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ప్రారంభం. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత సీజన్ ఫైనలిస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదిక.

టోర్నీ శుక్రవారం మొదలై మార్చి 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. గత సీజన్‌లో టోర్నీ ఒకే వేదికకు పరిమితమవ్వగా.. ఈ సారి రెండు వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. మొదటి దశ మ్యాచ్‌లకు బెంగళూరు వేదిక కానుంది. మార్చి 5 నుంచి ఢిల్లీ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఢిల్లీ వేదికగానే జరుగుతాయి. 22 రోజుల పాటు ఐదు జట్లు సందడి చేయనున్నాయి. ప్రారంభ సీజన్‌లో టైటిల్ ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్ టైటిల్ నిలబెట్టుకోవడంపై ఫోకస్ పెట్టింది. గత సీజన్‌లో తుది పోరులో బోల్తా పడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి టైటిల్ సాధించాలనే పంతంతో బరిలోకి దిగుతున్నది. గతేడాది ఎలిమినేటర్ నిష్ర్కమించిన యూపీ వారియర్స్ సైతం ఈ సారి గట్టి పోటీనివ్వాలనుకుంటున్నది. ఇక, గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. టోర్నీ ఫార్మాట్ విషయానికొస్తే.. ఐదు జట్లు లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ ఆడతాయి.

Advertisement

Next Story