టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి అదొక్కటే కారణం : రోహిత్

by Harish |
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి అదొక్కటే కారణం : రోహిత్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంపై రోహిత్ తొలిసారిగా స్పందించాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్.. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి అదే సరైన సమయమని భావించినట్టు తెలిపాడు. ‘టీ20లకు వీడ్కోలు పలకడానికి నాకు సరైన సమయం దొరికింది. 17 ఏళ్లుగా పొట్టి ఫార్మాట్‌ను చాలా ఎంజాయ్ చేశా. బాగా ఆడాను. టీ20 వరల్డ్ కప్ గెలిచాను. ఇక ముందుకు సాగడానికి, ఇతర విషయాలపై దృష్టి పెట్టానికి ఇదే సరైన సమయం అనుకున్నా. ఇంకేదో కారణంతో టీ20లకు వీడ్కోలు పలకలేదు. ఇప్పటికీ నేను మూడు ఫార్మాట్లు ఆడగలను.’ అని చెప్పాడు.

రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 500వ మ్యాచ్‌కు దగ్గర్లో ఉన్నాడు. ఇప్పటివరకు అతను మూడు ఫార్మాట్లలో కలిపి 484 మ్యాచ్‌లు ఆడాడు. దీనిపై హిట్‌మ్యాన్ స్పందిస్తూ..‘వరల్డ్ క్రికెట్‌లో చాలా మంది 500 మ్యాచ్‌లు ఆడలేదు. ఫిట్‌నెస్ కాపాడుకోవడం, మనసును నియత్రించుకోవడం, మీకు మీరు శిక్షణ ఇచ్చుకోవడం, ముఖ్యంగా మ్యాచ్‌కు ఏ విధంగా సిద్ధమవుతున్నామనే విషయాలు మన దినచర్యలో ఉంటే సుదీర్ఘ ప్రయాణానికి సాధ్యమవుతుంది. రికార్డులను పక్కనపెడితే మ్యాచ్ కోసం 100 శాతం సిద్ధమవడం, జట్టును గెలిపించడమే మా పని.’ అని చెప్పుకొచ్చాడు.

గంభీర్‌ది మొండి పట్టుదల

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ ఎవరికీ తలవంచడని, అతను మొండి పట్టుదల గల వ్యక్తి అని వ్యాఖ్యానించాడు. ఓటమిని ఒప్పుకోడని, ఆటగాడిగా ఎన్నోసార్లు కఠిన సందర్భాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడని చెప్పాడు.

Advertisement

Next Story