Ranji Trophy : ఫైనల్ బెర్త్‌కు 4 వికెట్ల దూరంలో విదర్భ

by Harish |
Ranji Trophy : ఫైనల్ బెర్త్‌కు 4 వికెట్ల దూరంలో విదర్భ
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ముంబై ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. మరో ఫైనల్ బెర్త్ కోసం విదర్భ, మధ్యప్రదేశ్ పోటీపడుతున్నాయి. నాగ్‌పూర్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న సెమీస్ మంగళవారం ఆసక్తికరంగా మారింది. విదర్భ విజయానికి 4 వికెట్ల దూరంలో ఉండగా.. మరో 93 పరుగులు చేస్తే మధ్యప్రదేశ్ గెలుస్తుంది. ఆటలో బుధవారం ఆఖరి రోజు కాగా.. మధ్యప్రదేశ్ కీలక వికెట్లు కోల్పోవడంతో విదర్భ గెలిచే అవకాశాలే ఎక్కువ.

ఓవర్‌నైట్ స్కోరు 343/6‌తో మంగళవారం ఆట కొనసాగించిన విదర్భ మరో 59 పరుగుల జోడించి 4 వికెట్లను కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 402 పరుగులకు ఆలౌటై.. మధ్యప్రదేశ్ ముందు 321 పరుగుల టార్గెట్ పెట్టింది. ఛేదనకు దిగిన మధ్యప్రదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఓపెనర్ యశ్ దూబె(94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. హర్ష్ గావ్లీ(67) సైతం రాణించాడు. హర్ష్ గావ్లీ అవుటైన తర్వాత యశ్ దూబె ఒంటరి పోరాటం చేయగా.. మిగతా ఎండ్‌లో ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు. కుమార్ కార్తికేయ(0 బ్యాటింగ్)తో కలిసి శరన్ష్ జైన్(16 బ్యాటింగ్) నాలుగో రోజు ఆటను ముగించాడు. విదర్భ బౌలర్లలో అక్షయ్ 3 వికెట్లతో రాణించగా.. ఆదిత్య 2 వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్ చేతిలో 4 వికెట్లు ఉండగా విజయతీరాలకు చేరాలంటే 93 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

Next Story