చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు.. ఒకేరోజు 19 వికెట్లు

by Swamyn |
చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు.. ఒకేరోజు 19 వికెట్లు
X

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. ప్లేట్ గ్రూపులో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. శనివారం బౌలర్లు రెచ్చిపోవడంతో హైదరాబాద్ కేవలం రెండు రోజుల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు రాహుల్ సింగ్(214) డబుల్ సెంచరీకితోడు తిలక్ వర్మ(100 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడంతో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 474/5 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, రెండో రోజు హైదరాబాద్ బౌలర్లు మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. 19 వికెట్లు తీసి నాగాలాండ్‌ను ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో కుప్పకూల్చారు.మొదట ఓవర్‌నైట్ స్కోరు 35/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నాగాలాండ్ 153 పరుగులకే ఆలౌటైంది. జగన్నాథ్ శ్రీనివాస్(49) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు తేలిపోయారు. హైదరాబాద్ బౌలర్ తనయ్ త్యాగరాజన్ 5 వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. చామ మిలింద్, కార్తికేయ రెండేసి వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల భారీ ఆధిక్యం పొందిన హైదరాబాద్.. నాగాలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ నాగాలాండ్ పేలవ ప్రదర్శననే చేసింది. 127 పరుగులకే ఆలౌటైంది. సుమిత్ కుమార్(62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముగ్గురు ఖాతా తెరవకపోగా.. నలగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చామ మిలింద్ 4 వికెట్లు, తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో సత్తాచాటారు.


Advertisement

Next Story