తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు పాట్నా పైరేట్స్

by Harish |
తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు పాట్నా పైరేట్స్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌‌లో తెలుగు టైటాన్స్ ఓటమిపరంపర కొనసాగుతోంది. టోర్నీలో ఆ జట్టు 18వ ఓటమిని చవిచూసింది. పాట్నా పైరేట్స్ చేతిలో పోరాడి ఓడింది. మంగళవారం కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌పై 36-38 తేడాతో పాట్నా పైరేట్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో పాట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. మొదటి నుంచి ఇరు జట్లు పోటాపోటీగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ ఆసక్తిరంగా సాగింది. ఫస్టాఫ్‌లో పరస్పరం ఇరు జట్లు ఆలౌట్ చేసుకున్నాయి. అయితే, ఫస్టాఫ్‌లో 22-20 తేడాతో టైటాన్స్ రెండు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది. సెకండాఫ్‌లోనూ ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీపడ్డాయి. అయితే, టైటాన్స్‌ను పాట్నా మరోసారి ఆలౌట్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుని 2 పాయింట్ల తేడాతో గెలుపొందింది. పాట్నా తరపున మన్‌జీత్ 8 పాయింట్లు, సందీప్ 7 పాయింట్లతో రాణించారు. కెప్టెన్ పవన్ 16 పాయింట్లతో చెలరేగినప్పటికీ టైటాన్స్‌ను గెలిపించలేకపోయాడు. ఈ నెల 16న జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed