Paris Olympics : టోక్యో క్రీడలను మరిపిస్తారా?.. భారత అథ్లెట్లపై కొండంత ఆశలు

by Harish |
Paris Olympics : టోక్యో క్రీడలను మరిపిస్తారా?.. భారత అథ్లెట్లపై కొండంత ఆశలు
X

దిశ, స్పోర్ట్స్ : ఒలింపిక్స్‌లో క్రమంగా భారత్ పతకాల సంఖ్య మెరుగవుతుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 3 పతకాలు సాధించగా..2012లో జరిగిన లండన్‌ విశ్వక్రీడల్లో మన అథ్లెట్లు 6 పతకాలు కొల్లగొట్టారు. ఇక, టోక్యో క్రీడల్లో 7 పతకాలు అందించారు. అందులో స్వర్ణంతోసహా 2 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పారిస్ ఒలింపిక్స్‌లో టోక్యో క్రీడల రికార్డును బద్దలుకొట్టాలని మన అథ్లెట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సారి 10 పతకాలు దక్కే అవకాశం ఉంది. అథ్లెటిక్స్‌లో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి స్వర్ణం తెచ్చేలా కనిపిస్తున్నాడు. అతని పేరిట ఏదో ఒక పతకమైతే ఖాయమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే ఈవెంట్‌లో కిశోర్ జెనాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే, మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి కూడా పతకం తెచ్చే సత్తా ఉంది. మహిళల 100 మీర్ల హార్డిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజిపై కూడా అంచనాలు ఉన్నాయి.

ఇక, బ్యాడ్మింటన్‌లో కొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న సాత్విక్-చిరాగ్ జోడీపై భారీ ఆశలే ఉన్నాయి. సింగిల్స్‌లో పీవీ సింధు హ్యాట్రిక్ మెడల్‌పై కన్నేసింది. హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌ ఒత్తిడి తట్టుకుని నిలబడితే వారికి పతకం తెచ్చే సత్తా ఉంది. బాక్సింగ్‌లో వరుసగా రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ పసిడి ఆశలు రేపుతోంది. లవ్లీనా బోర్గోహైన్ కూడా రెండో ఒలింపిక్స్ పతకంపై ఫోకస్ పెట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన హాకీ జట్టు ఈ సారి పతకం రంగును మార్చాలని చూస్తోంది. షూటింగ్‌లో మను భాకర్‌పై అంచనాలు ఉండగా.. ఆర్చరీలో దీపిక కుమారి, ధీరజ్‌పై ఆశలు ఉన్నాయి. ఇక, గత మూడు పర్యాయాలుగా రెజ్లింగ్‌లో భారత్ పతకం సాధిస్తూ వస్తోంది. ఈ సారి కూడా మెడల్ వచ్చే చాన్స్‌లు ఎక్కువగానే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను దేశానికి మరో పతకం అందించాలని చూస్తోంది.



Next Story