‘‘మరీ మూర్ఖంగా..!’’ బాబర్ ఆజమ్‌పై పాక్ మాజీ సెలక్టర్ షాకింగ్ కామెంట్స్

by Julakanti Pallavi |
‘‘మరీ మూర్ఖంగా..!’’ బాబర్ ఆజమ్‌పై పాక్ మాజీ సెలక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌పై ఆ టీం మాజీ సెలక్టర్ మహమ్మద్ వసీమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను చీఫ్ సెలక్టర్‌గా ఉన్నప్పుడు జట్టును బలంగా మార్చడానికి సజెషన్స్ ఇచ్చినా బాబర్ తీసుకునేవాడు కాదు. ముఖ్యంగా అప్పట్లో టీంలో కొన్ని కీలక మార్పులు చేయాలని సూచించాను. ఇమాద్ వసీం లాంటి కొంతమంది ఆటగాళ్లను తప్పించాలని బాబర్‌కు చెప్పాను. కానీ అతడు మాత్రం మూర్ఖంగా మొండిపట్టు పట్టి మరీ ఆ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాడు. ఫలితంగా గెలవాల్సిన మ్యాచ్‌లు కూడా ఓడిపోయాడు.’’ అంటూ బాబర్‌‌పై వసీమ్ తీవ్ర విమర్శలు చేశాడు.

అప్పటి కోచ్‌లు కూడా కొంతమంది ఆటగాళ్లను జట్టుకు క్యాన్సర్‌లా పట్టుకున్నారని, వాళ్లని తొలగిస్తే కానీ జట్టు బాగుపడదని తనకు చెప్పేవాళ్లని, అదే విషయాన్ని బాబర్‌కు చెబితే అతడు పట్టించుకోలేదని, టీం మేనేజ్‌మెంట్ కూడా తన మాట వినలేదని వసీమ్ తెలిపాడు.

ఒకవేళ తాను చెప్పిన మార్పులు చేసి, ఆ ఆటగాళ్లను తీసేసి ఉంటే పాకిస్తాన్‌ జట్టు ఇంత దారుణ స్థితికి దిగజారకుండా ఉండేదని అవేదన వ్యక్తం చేశాడు. బాబర్‌కు నచ్చజెప్పడం, ఏదైనా విషయాన్ని అతడికి అర్థమయ్యేలా వివరించడం చాలా కష్టమని వాసిమ్ అన్నాడు.

కాగా.. 2020లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన బాబర్.. స్వదేశంలో జరిగిన అనేక సిరీస్‌లలో మెరిశాడు. పాక్ జట్టు కూడా వరుస విజయాలు సాధించింది. కానీ 2023 వన్డే వరల్డ్‌లో భారత్ చేతిలో ఓడిపోవడం, ఆ తర్వాత మరింత చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచే వైదొలగడంతో బాబర్ కెప్టెన్సీపై విమర్శలొచ్చాయి. ఆ క్రమంలోనే బాబర్ తన కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. కానీ పీసీబీ మేనేజ్‌మెంట్ మారడంతో 2024 టీ20 వరల్డ్ కప్‌లో మళ్లీ బాబర్ సారథ్యంలోనే పాక్ జట్టు బరిలోకి దిగింది. అయితే ఈ సారి మరింత దారుణంగా తొలిసారి టోర్నీ ఆడుతున్న యూఎస్‌ఏ చేతిలో కూడా ఘోరంగా ఓడి ఇంటి దారి పట్టింది.

ఇక తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో కూడా తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓటమి చవి చూసింది. దీంతో పీసీబీ జట్టును ప్రక్షాళన చేసే పనిలో పడింది. అందులో భాగంగానే బంగ్లాతో జరగబోతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్ ఆడే జట్టులో నుంచి షాహీన్ షా అఫ్రిదీ లాంటి ఆటగాళ్లను తొలగించింది.

Advertisement

Next Story

Most Viewed