Paris olympics : నీరజ్ స్వర్ణం గెలవకపోవడం వెనుక రీజన్ ఇదే.. డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ ఏం చెప్పాడంటే?

by Harish |
Paris olympics : నీరజ్ స్వర్ణం గెలవకపోవడం వెనుక రీజన్ ఇదే.. డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ ఏం చెప్పాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ రజతం దక్కించుకున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలిచిన అతను పారిస్‌లోనూ స్వర్ణం గెలుస్తాడని అంతా భావించినా అతను సిల్వర్ మెడల్‌తో సరిపెట్టాడు. రెండో ప్రయత్నంలో నీరజ్ 89.45 మీటర్ల ప్రదర్శన అతనికి రజతాన్ని తెచ్చిపెట్టింది. అయితే, బల్లెం విసిరే సమయంలో అతను కొద్దిగా అసౌకర్యంగా కనిపించాడు. రెండో ప్రయత్నం మినహా మిగతా ఐదు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. తాజాగా తాను అసౌకర్యంగా ఉండటానికి గల కారణాన్ని నీరజ్ వివరించాడు. గజ్జలో గాయం ఇబ్బందిపెట్టిందని, అందుకే వేగంగా పరుగెత్తలేకపోయానని చెప్పాడు.

ఈవెంట్ తర్వాత నీరజ్ తన ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘అది మంచి త్రోనే. కానీ, నేను నా ప్రదర్శన పట్ల సంతోషంగా లేను. పరుగు బాగా లేకుండా జావెలిన్‌‌ను దూరంగా విసరలేం. గత రెండు మూడేళ్లుగా గాయాలు వేధిస్తున్నాయి. గజ్జలో గాయం కారణంగా ట్రైనింగ్‌లోనూ ఎక్కువ త్రోలు వేయలేకపోయా.’ అని చెప్పాడు. అలాగే, త్రో వేసే సమయంలో తన దృష్టి 60-70 శాతం గాయంపైనే ఉందని, తన పరుగు వేగం తక్కువ ఉండటం చూడొచ్చని తెలిపాడు. ‘డాక్టర్ సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. కానీ, వరల్డ్ చాంపియన్స్‌కు ముందు, ఆ తర్వాత నాకు అంత సమయం లేదు. ఎందుకంటే, ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడానికి చాలా సమయం పడుతుంది.’ అని తెలిపాడు. కాగా, పీవీ సింధు, సుశీల్ కుమార్ తర్వాత వరుస ఒలింపిక్స్‌ల్లో పతకాలు గెలిచిన మూడో అథ్లెట్‌గా నీరజ్ రికార్డు నెలకొల్పాడు.

Advertisement

Next Story