ఆ ఐదు సిక్సర్ల తర్వాత నా జీవితం మారిపోయింది : Rinku Singh

by Vinod kumar |
ఆ ఐదు సిక్సర్ల తర్వాత నా జీవితం మారిపోయింది : Rinku Singh
X

న్యూఢిల్లీ : ఐపీఎల్-16 సీజన్ గురించి మాట్లాడుకుంటే కచ్చితంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ గుర్తొస్తాడు. గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్‌లో అతను బాదిన ఐదు సిక్స్‌ల విధ్వంసకర ఇన్నింగ్స్ గుర్తుకొస్తుంది. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో రింకు సింగ్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఏకంగా టీమ్ ఇండియా నుంచి పిలుపు అందుకున్నాడు. ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన భారత జట్టులో రింకు సింగ్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా టీమ్ ఇండియాకు తొలిసారిగా ఎంపికవడంపై రింకు సింగ్ స్పందించాడు. ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘ఐదు సిక్స్‌ల నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. అంతకుముందు నేను కొంతమందికే తెలుసు. కానీ, ఆ ఇన్నింగ్స్ తర్వాత చాలా మంది నన్ను గుర్తుపడుతున్నారు.’ అని రింకు సింగ్ తెలిపాడు. అలాగే, భారత జట్టుకు ఎంపికవడంపై అతను సంతోషం వ్యక్తం చేశాడు.

‘ఆసియా గేమ్స్‌కు ఎంపికయ్యానని తెలిసి చాలా ఎమోషనల్ అయ్యా. ఈ మూమెంట్ కోసమే ఎంతో కష్టపడ్డా. చివరకు నేను సాధించాను. మా కుటుంబం ఏదో ఒక రోజు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తావని చెప్పేవారు. ఈ విషయం తెలిసి వాళ్లు చాలా సంతోషపడ్డారు. ఆనందంతో డ్యాన్స్ చేశారు.’ అని చెబుతూ రింకు సింగ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. తనకు తుది జట్టులో అవకాశం వస్తే కచ్చితంగా బాగా ఆడతానని దీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌-16లో రింకు సింగ్ 14 మ్యాచ్‌ల్లో 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. కోల్‌కతా తరఫున టాప్ రన్‌స్కోరర్ అతనే. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు.

Advertisement

Next Story

Most Viewed