ధోని హెల్త్ అప్‌డేట్.. సీఎస్‌కే సీఈఓ కీలక విషయాలు వెల్లడి

by Vinod kumar |   ( Updated:2023-06-01 17:22:16.0  )
ధోని హెల్త్ అప్‌డేట్.. సీఎస్‌కే సీఈఓ కీలక విషయాలు వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో గురువారం ఉదయం 8 గంటలకు ఈ ఆపరేషన్ జరిగింది. ధోని మోకాలికి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్‌ వెల్లడించారు. సర్జరీ అనంతరం తాను ధోనితో మాట్లాడానని.. శస్త్రచికిత్స గురించి వివరించలేను కానీ అది కీ-హోల్ ఆపరేషన్‌ అని మాత్రం చెప్పగలనన్నారు. మొత్తంగా ధోనికి జరిగిన ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యిందని తెలిపారు. సీఎస్‌కే టైటిల్‌ గెలిచిన 48 గంటల్లోనే ధోని ఆసుపత్రిలో చేరాడు. తాజాగా శస్త్ర చికిత్స సైతం విజయవంతంగా పూర్తి చేసుకుని మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ కానున్నాడు.

ఈ గాయం నుంచి కోలుకునేదాన్ని బట్టి ధోనీ ఐపీఎల్ కెరీర్ ఆధారపడనుంది. వచ్చే సీజన్ కూడా ఆడుతానని ప్రకటించిన ధోనీ.. అందుకోసమే శస్త్ర చికిత్స తీసుకుని ఫిట్‌నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ 2022 మినీ వేలానికి ఇంకా 6 నెలల సమయం ఉన్న నేపథ్యంలో.. అప్పటి వరకు ఫిట్‌గా మారితే ధోనీ బరిలోకి దిగుతాడు. లేదంటే ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటాడు. అభిమానుల కోసమే వచ్చే సీజన్ ఆడాలనుకుంటున్నట్లు ఇప్పటికే ధోనీ వెల్లడించిన విషయం తెలిసిందే.

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ 2023 ఫైనల్స్‌లో ధోని సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాహా (54), సాయి సుదర్శన్‌ (96) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. ఛేదనలో సీఎస్‌కే 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. రుతురాజ్‌ (26), కాన్వే (47), శివమ్‌ దూబే (32 నాటౌట్‌), రహానే (27), రాయుడు (19), జడేజా (15 నాటౌట్‌) తలో చేయి వేసి సీఎస్‌కేను గెలిపించారు.

Advertisement

Next Story