బాంబ్ పేల్చిన ధోనీ.. ఆ పోస్టుకు అర్థమేంటి?

by Harish |
బాంబ్ పేల్చిన ధోనీ.. ఆ పోస్టుకు అర్థమేంటి?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. అన్ని జట్ల ఆటగాళ్లు సన్నద్ధత మొదలుపెట్టారు. ఆయా జట్లు ప్రీ ఐపీఎల్ క్యాంప్‌లు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ కూడా ప్రీ ఐపీఎల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే తొలి బ్యాచ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బాంబ్ పేల్చాడు. ఫేస్‌బుక్‌లో అతను పెట్టిన పోస్టుతో అభిమానులు కన్ఫ్యూజ్‌లో పడిపోయారు.

అసలు ధోనీ ఏం పోస్టు చేశాడంటే.. ‘కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. క్షణాల్లోనే ఈ పోస్టు వైరల్‌గా మారింది. ధోనీ పెట్టిన పోస్టుతో సీఎస్కే ఫ్యాన్స్ షాక్ గురవుతున్నారు. అసలు ధోనీ చేపట్టబోయే కొత్త రోల్ ఏంటా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. సీఎస్కే కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై చెప్పి మెంటార్‌గా వ్యవహరిస్తాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు ఆ పోస్టు అర్థం అదేనంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు యాడ్ గురించి అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఆ పోస్టుపై ధోనీ స్పష్టతనిస్తేనే అసలు విషయం ఏంటనే దానిపై క్లారిటీ వస్తుంది.

గత సీజన్‌లో మోకాలి గాయంతోనే ధోనీ లీగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. గాయం ఇబ్బందిపెట్టినప్పటికీ అతను జట్టును ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. టోర్నీ తర్వాత ధోనీ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ఇటీవల ఐపీఎల్-2024 కోసం ధోనీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టగా.. వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ధోనీ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు భార్య సాక్షితో కలిసి హాజరయ్యాడు.

Advertisement

Next Story