టాప్-25 ర్యాంకింగ్స్‌లో మనికా బాత్రా.. తొలి భారత మహిళా టీటీ ప్లేయర్‌గా ఘనత

by Harish |
టాప్-25 ర్యాంకింగ్స్‌లో మనికా బాత్రా.. తొలి భారత మహిళా టీటీ ప్లేయర్‌గా ఘనత
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా మహిళల సింగిల్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించింది. మంగళవారం ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీటీఎఫ్) రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో మనికా ఏకంగా 15 స్థానాలు ఎగబాకింది. 39వ ర్యాంక్ నుంచి 24వ స్థానానికి చేరుకుంది. దీంతో ఐటీటీఎఫ్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-25లోకి ప్రవేశించిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది. 2019లో సత్యన్ జ్ఞానేశ్వరన్ 24వ ర్యాంక్‌తో సింగిల్స్‌లో హయ్యెస్ట్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో మనికా అద్భుత ప్రదర్శన చేసింది. రెండో రౌండ్‌లో వరల్డ్ నం.2, ఒలింపిక్ మెడలిస్ట్ వాంగ్ మన్యును, ప్రీక్వార్టర్స్‌లో 14వ ర్యాంకర్ నినా మిట్టెల్‌హామ్‌ను ఓడించడం ద్వారా ఆమె తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. అంతేకాకుండా, ఇటీవల కోల్పోయిన భారత నం.1 స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజను వెనక్కినెట్టి తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు కోల్పోయి 41వ ర్యాంక్‌కు పడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్‌తో భారత్ తరపున టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. మహిళల డబుల్స్‌లో సుతీర్థ ముఖర్జీ-ఐహికా ముఖర్జీ జోడీ 13వ స్థానానికి చేరుకోగా, పురుషుల డబుల్స్‌లో మానవ్ ఠక్కర్-మానుష్ షా జంట మూడు స్థానాలు కోల్పోయి 15వ ర్యాంక్‌లో నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మనికా-సత్యన్ జోడీ 24వ ర్యాంక్‌లో నిలిచింది.

Advertisement

Next Story