హార్దిక్ కూడా మనిషే.. దారుణంగా ప్రవర్తించాం : కృనాల్ పాండ్యా ఎమోషనల్ పోస్టు

by Harish |
హార్దిక్ కూడా మనిషే.. దారుణంగా ప్రవర్తించాం : కృనాల్ పాండ్యా ఎమోషనల్ పోస్టు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, టీ20 ప్రపంచకప్‌కు ముందు అతను దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం, భార్యతో విడాకుల రూమర్లతో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హార్దిక్ గురించి అతని సోదరుడు, భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. హార్దిక్‌ కూడా మనిషే అన్న విషయం మరిచిపోయి ప్రవర్తించామని ఆవేదన చెందాడు.

‘గత ఆరు నెలలు హార్దిక్‌కు కష్టతరమైన కాలం. అతను అనుభవించిన దానికి అర్హుడు కాదు. బ్రదర్‌గా నేను చాలా బాధపడ్డా. అతను కూడా ఎమోషన్స్ ఉన్న మనిషే అన్న విషయం మర్చిపోయేలా ప్రవర్తించాం. అతను చిరునవ్వుతో అవన్నీ దాటాడు. అతను నవ్వడం వెనుక కష్టం నాకు తెలుసు. చాలా కష్టపడ్డాడు. ప్రపంచకప్ గెలవడానికి నేను ఏం చేయాలన్నదే దానిపైనే ఫోకస్ పెట్టాడు. భారత్ స్వపాన్ని సాధించడంలో అతను భాగమయ్యాడు. ప్రజలకు ఒక్కటి గుర్తు చేయాలనుకుంటున్నా. ఇంత తక్కువ కెరీర్‌లో అతను సాధించినది నమ్మశక్యం కానిది. జాతీయ జట్టు విషయంలో అతను రాజీపడడు. హార్దిక్‌కు దేశమే ముందు. బరోడా నుంచి వచ్చిన ఓ కుర్రాడికి తన జట్టుకు వరల్డ్ కప్ అందించడంలో సహాయపడటం కంటే విజయం మరొకటి ఉండదు.’ అని కృనాల్ రాసుకొచ్చాడు. ఐపీఎల్‌లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న పాండ్యా టీ20 ప్రపంచకప్‌‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాతో ఫైనల్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు. ప్రపంచకప్‌లో పాండ్యా 144 పరుగులు, 11 వికెట్లు తీశాడు.

Advertisement

Next Story

Most Viewed