Korea Open 2023: క్వార్టర్స్‌కు సాత్విక్ జోడీ..

by Vinod kumar |
Korea Open 2023: క్వార్టర్స్‌కు సాత్విక్ జోడీ..
X

యోసు : కొరియా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పురుషుల డబుల్స్ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-17, 21-15 తేడాతో చైనాకు చెందిన హీ జీ టింగ్-జౌ హౌడాంగ్‌ జంటను చిత్తు చేసింది. మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చిన భారత జంట 43 నిమిషాల్లోనే వరుస గేమ్‌లను గెలుచుకుంది. తొలి గేమ్‌లో సాత్విక్ జోడీ ఆరంభం నుంచి లీడ్‌లోనే ఉన్నప్పటికీ చైనా షట్లర్ల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ఆట ఆసక్తికరంగా సాగింది. అయితే, 17-14తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత భారత షట్లర్లు అదే జోరులో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇక, రెండో గేమ్‌లో సాత్విక్ జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.. చైనా షట్లర్లు ప్రేక్షక పాత్రకే పరిమితమై గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సమర్పించుకున్నారు.

క్వార్టర్ ఫైనల్‌లో భారత షట్లర్లు.. 5వ సీడ్, జపాన్‌కు చెందిన టకురో హోకి-యుగో కోబయాషి‌ జంటతో తలపడనున్నారు. ఉమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీ 11-21, 4-21 తేడాతో 2వ సీడ్, బేక్ హా నా-లీ సో హీ(కొరియా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ కూడా నిరాశే ఎదురైంది. రెండో రౌండ్‌లో హాంకాంగ్ ప్లేయర్లీ చెయుక్ యియ్ చేతిలో 21-15, 19-21, 21-18 తేడాతో పోరాడి ఓడి ఇంటిదారి పట్టాడు. యువ ఆటగాడు ప్రియాన్స్ రజావత్ 14-21, 21-18. 17-21 తేడాతో టాప్, జపాన్ ఆటగాడు కోడై నరౌక చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో టోర్నీలో సింగిల్స్‌లో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-సక్కిరెడ్డి జంట 15-21, 12-21 తేడాతో చైనాకు చెందిన ఫెంగ్ యాన్జే-హువాంగ్ డాంగ్ పింగ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Advertisement

Next Story

Most Viewed