రెండో రౌండ్‌లోనే శ్రీకాంత్ ఇంటికి.. షాకిచ్చిన మంజునాథ్

by Harish |
రెండో రౌండ్‌లోనే శ్రీకాంత్ ఇంటికి.. షాకిచ్చిన మంజునాథ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. థాయిలాండ్ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసిన శ్రీకాంత్ రెండో రౌండ్‌లో నిరాశపరిచాడు. యువ షట్లర్, సహచరుడు మిథున్ మంజునాథ్ చేతిలో ఓడి ఇంటి దారిపట్టాడు. బ్యాంకాక్‌లో గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్‌పై 9-21, 21-13, 17-21 తేడాతో మంజునాథ్ గెలుపొందాడు. దీంతో అతను క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ మంజునాథ్‌దే. స్పష్టమైన ఆధిపత్యం చాటుతూ గేమ్‌ను దక్కించుకోగా.. శ్రీకాంత్ అస్సలు పోరాట పటిమ కనబర్చలేదు. అనంతరం పుంజుకున్న శ్రీకాంత్ రెండో గేమ్‌ను సాధించి పోటీలోకి వచ్చాడు. మొదట్లో 3-0తో వెనుకబడిన అతను 6-6తో స్కోరును సమం చేసిన తర్వాత రెచ్చిపోయాడు. వరుసగా 10 పాయింట్లు నెగ్గి రెండో గేమ్‌ను ఏకపక్షంగా గెలుచుకున్నాడు. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు నడిచింది. ఆరంభంలో 4-2తో శ్రీకాంతే లీడ్‌లో ఉండగా.. మంజునాథ్ పుంజుకుని 11-7తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ నెగ్గాడు. మరోవైపు, మూడో గేమ్‌లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయాడు. గతేడాది ఆగస్టులో చివరిసారిగా శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత అతను రెండో రౌండ్ దాటమే కష్టంగా మారింది. మరో భారత యువ షట్లర్ సుబ్రమణియన్ సైతం రెండో రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు.

మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో యువ క్రీడాకారిణి అష్మిత క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పో‌‌పై 12-21, 15-21, 21-17 తేడాతో విజయం సాధించింది. మరో భారత షట్లర్ మాళవిక బాన్సోద్ 22-24, 7-21 తేడాతో 5వ సీడ్, థాయిలాండ్‌ క్రీడాకారిణి బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్‌ చేతిలో ఓడిపోయింది. ఉమెన్స్ డబుల్స్‌లో భారత జంట ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ 21-15, 24-22 తేడాతో సహచర జోడీ తనీషా క్రాస్టో-అశ్విని పొనప్పపై గెలిచి టోర్నీలో ముందడుగు వేసింది.

Advertisement

Next Story