టీ20 ప్రపంచకప్ విజయాన్ని వారికి అంకితం ఇచ్చిన జై షా

by Harish |
టీ20 ప్రపంచకప్ విజయాన్ని వారికి అంకితం ఇచ్చిన జై షా
X

దిశ, స్పోర్ట్స్ : 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమ్ ఇండియా సాధించిన టీ20 వరల్డ్ కప్ విజయాన్ని భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు అంకితం ఇస్తున్నట్టు బీసీసీఐ సెక్రెటరీ జై షా తెలిపారు. సౌతాఫ్రికాతో ఫైనల్‌తో ద్రవిడ్ పదవీ కాలం ముగియగా.. ప్రపంచకప్ విజయం అనంతరం రోహిత్, కోహ్లీ, జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టీమ్ ఇండియాకు జై షా అభినందనలు తెలిపాడు.

ఆ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘చారిత్రాత్మక టీ20 వరల్డ్ కప్ విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు. ఈ విక్టరీని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్, కోహ్లీ, జడేజాలకు అంకితం ఇవ్వాలనుకుంటున్నా. గతేడాది జూన్‌లో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఓడిపోయాం. గతేడాది నవంబర్‌లో హృదయాలను గెలుచుకున్నాం. కానీ, కప్‌ను గెలవలేదు. హృదయాలతోపాటు ట్రోఫీని గెలిచి, బార్బడోస్‌లో భారత జెండాను ఎగురవేస్తానని ఈ ఏడాది రాజ్‌కోట్‌లో చెప్పాను. మన కెప్టెన్ అది సాధించాడు.’అని జై షా తెలిపాడు.

అలాగే, ఫైనల్‌లో చివరి ఐదు ఓవర్లలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్, బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యాలకు స్పెషల్‌గా థాంక్యూ చెప్పాడు. ఈ సందర్భంగా రోహిత్ కెప్టెన్‌గా కొనసాగడంపై జై షా స్పష్టతనిచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, చాంపియన్స్ ట్రోఫీలకు అతనే సారథిగా ఉంటాడని వెల్లడించాడు. ‘టీ20 వరల్డ్ కప్ సాధించాం. ఇక మన టార్గెట్ డబ్ల్యూటీసీ ఫైనల్, చాంపియన్స్ ట్రోఫీ గెలవడం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అవి కూడా సాధిస్తామని నమ్మకం ఉంది.’ అని జై షా చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed