టీ20 వరల్డ్ కప్‌కు టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు దూరం.. క్లారిటీ ఇచ్చిన జై షా

by Harish |   ( Updated:2024-03-11 13:01:34.0  )
టీ20 వరల్డ్ కప్‌కు టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు దూరం.. క్లారిటీ ఇచ్చిన జై షా
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా ధ్రువీకరించారు. సోమవారం జాతీయ మీడియాతో జై షా మాట్లాడుతూ.. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌ నాటికి షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ఇటీవలే అతనికి లండన్‌లో సర్జరీ జరిగిందని, స్వదేశానికి తిరిగి వచ్చినట్టు తెలిపాడు. వన్డే వరల్డ్ కప్‌లో షమీ అద్భుత ప్రదర్శనతో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత అతనికి చీలమండలం గాయమైంది. దీంతో సౌతాఫ్రికా పర్యటన, ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌‌తోపాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

ఇటీవల లండన్‌లో షమీ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అతను కోలుకునేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్‌కు కూడా దూరంకానున్నాడు. గుజరాత్ జెయింట్స్‌లో షమీ కీలక ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే, వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్ జూన్‌లో జరగనుంది. వరల్డ్ కప్‌ నాటికి కూడా అతను కోలుకునే అవకాశాలు లేవు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తోపాటు సొంతగడ్డపై జరిగే సిరీస్‌కు షమీ అందుబాటులో ఉంటాడని జై షా వెల్లడించారు. దీంతో షమీ ఆరు నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ప్రపంచకప్‌లో షమీ లేకపోవడం భారత్‌కు భారీ లోటే అని చెప్పొచ్చు.

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై కూడా జై షా అప్‌డేట్ ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో తొడకండరాల గాయం బారిన పడిన రాహుల్ మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల లండన్‌లో స్పెషలిస్ట్ వద్ద చికిత్స తీసుకుని స్వదేశానికి వచ్చాడు. ప్రస్తుతం రాహుల్ ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ ప్రారంభించాడని, అతనికి ఇంజక్షన్ అవసరముందని జై షా తెలిపారు. ఐపీఎల్‌తో అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అంతకుముందు అతను ఎన్‌సీఏ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌ అతను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story