- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2025 : కోల్‌కతా టైటిల్ కాపాడుకుంటుందా?.. ఆ జట్టు బలాలు, బలహీనతలు ఇవే

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్. దాదాపు దశాబ్దం తర్వాత కేకేఆర్ గతేడాది మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు 2012, 2014 సీజన్లలో టైటిల్ గెలిచింది. 2024లో హెడ్ కోచ్ గంభీర్ మార్గదర్శకత్వంలో.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కోల్‌కతా సంచలన ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నది. దీంతో కేకేఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత సీజన్‌తో పోలిస్తే కోల్‌కతాలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. గౌతమ్ గంభీర్ కోల్‌కతాను వీడి టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్‌ను జట్టు వదులుకుంది. సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. పలువురు కొత్త ఆటగాళ్లు కూడా జట్టులో చేరారు. పేపర్‌పై బలంగానే కనిపిస్తున్న కోల్‌కతా ఈ సీజన్‌లోనూ జోరు కొనసాగించాలని భావిస్తున్నది. ఈ నెల 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడటం ద్వారా ఆ జట్టు టైటిల్ వేటను మొదలుపెట్టనుంది.
బలాలు ఇవే
యువకులు, అనుభవజ్ఞులతో కోల్‌కతా సమతుల్యంగా కనిపిస్తున్నది. రహానె అనుభవం జట్టుకు ఉపయోగపడనుంది. ప్లేయర్‌గానూ అతను మంచి టచ్‌లోనే ఉన్నాడు. జాతీయ జట్టుకు ఆడనప్పటికీ దేశవాళీలో ముంబై తరపున సత్తాచాటాడు. సయ్యుద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 469 రన్స్ చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, సునీల్ నరైన్, రస్సెల్, పొవెల్, రమణ్‌దీప్ సింగ్ వంటి హిట్టర్లు జట్టుకు బలంగా కనిపిస్తున్నారు. 7వ స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉండటం కేకేఆర్‌ను సానుకూలంశం. ఇక, బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, యువ పేసర్ హర్షిత్ రాణా జట్టుకు ప్రధాన బలంగా ఉన్నారు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. యువ పేసర్ హర్షిత్ రాణా కూడా టచ్‌లోనే ఉన్నాడు. గతేడాది వరుణ్ 21 వికెట్లు తీయగా.. రాణా 19 వికెట్లు పడగొట్టాడు. ఈ సారి కూడా వీరి ప్రదర్శనపైనే జట్టు పర్ఫామెన్స్ ఆధారపడి ఉన్నది. ఎన్రిచ్ నోర్జే, జాన్సెన్ వంటి విదేశీ బౌలర్లు అదనపు బలం.
సవాళ్లు ఇవే
సునీల్ నరైన్, రస్సెల్ కేకేఆర్ జట్టులో కీలక ఆటగాళ్లు. వారి ఫిట్‌నెస్ ప్రధాన సమస్యగా మారనుంది. గాయం లేదా ఇతర ప్రాబ్లమ్స్‌తో వారు దూరమైతే జట్టు కాంబినేషన్ దెబ్బతింటుంది. గత సీజన్‌లో వీరిద్దరూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, ఐపీఎల్ తర్వాత వారు గొప్పగా రాణించలేదు. మరోవైపు, వెన్ను నొప్పి నుంచి ఇటీవలే కోలుకున్న పేసర్ ఎన్రిచ్ నోర్జే ఫిట్‌నెస్ కూడా ఆందోళనకరంగానే ఉంది. అతను రాణించకపోతే హర్షిత్ రాణా ఒక్కడే పేస్ దళాన్ని మోయాల్సి వస్తుంది. జాన్సెన్ రూపంలో మరో పేసర్ ఉన్నా అతనికి అనుభవం తక్కువ. వేలంలో ఫిలిప్ సాల్ట్‌ను వద్దనుకుని తీసుకున్న డి కాక్ గత సీజన్‌లో లక్నో తరపున మోస్తారు ప్రదర్శననే చేశాడు. 11 మ్యాచ్‌ల్లో 250 రన్స్ చేశాడు. ఓపెనర్‌గా జట్టు అతనిపై భారీ అంచనాలు పెట్టుకోగా.. డికాక్ ఏ మేరకు శుభారంభం అందిస్తాడో చూడాలి.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు
అజింక్యా రహానె(కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీశ్ పాండే, రొవ్‌మన్ పొవెల్, రఘువంశీ, గుర్బాజ, రమణ్‌దీప్ సింగ్, రింకు సింగ్, లవ్‌నిత్ సిసోడియా, మెయిన్ అలీ, వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్, అంకుల్ రాయ్, రస్సెల్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, స్పెన్సెర్ జాన్సెన్, మయాంక్ మార్కండే, ఎన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, వరుణ చక్రవర్తి