టీమ్ ఇండియా కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్.. మరోసారి బ్యాటు పట్టనున్న క్రికెట్ దిగ్గజం

by Harish |
టీమ్ ఇండియా కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్.. మరోసారి బ్యాటు పట్టనున్న క్రికెట్ దిగ్గజం
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి భారత జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. అవును.. ఇది నిజమే. 2013లోనే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు కదా అనుకుంటున్నారా?.. అయితే, సచిన్ కెప్టెన్‌గా ఉండబోతున్నది జాతీయ జట్టుకు కాదు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌(ఐఎంఎల్)లో పాల్గొనే భారత జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు.

ఈ దిగ్గజ క్రికెటర్ ఐఎంఎల్‌ ద్వారా మరోసారి బ్యాటు పట్టబోతున్నాడు. ఇటీవలే సచిన్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఐఎంఎల్ లీగ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో జరగబోయే టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్‌తోసహా శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడనున్నాయి. ఆయా జట్ల దిగ్గజ క్రికెటర్లు ఈ టోర్నీ ఆడనునున్నారు.

భారత జట్టుకు సచిన్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. అలాగే, వెస్టిండీస్‌ సారథిగా బ్రియాన్ లారా, శ్రీలంక కెప్టెన్‌గా కుమార్ సంగక్కర నియామకమవ్వగా.. ఆస్ట్రేలియాను షేన్ వాట్సన్, ఇంగ్లాండ్‌ను ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికాను జాక్వెస్ కల్లీస్ నడిపించనున్నారు. ఈ ఏడాది తొలి సీజన్ మొదలుకానుంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 8 వరకు టోర్నీ జరగనుంది. ముంబై వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్‌తో లీగ్‌కు తెరలేవనుంది. కాగా, టీమిండియా తరపున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక్క టీ20 ఆడిన సచిన్ మూడు ఫార్మాట్లలో కలిపి 34,357 రన్స్ చేశాడు. అలాగే, 25 టెస్టులు, 73 వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Advertisement

Next Story

Most Viewed