పాకిస్తాన్ ముందు ఉగ్రవాదాన్ని ఆపాలి : కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్

by Harish |
పాకిస్తాన్ ముందు ఉగ్రవాదాన్ని ఆపాలి : కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాక్‌లో పర్యటించడంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను మానుకుంటేనే భారత్ ఆ దేశంలో అడుగుపెడుతుందని తెలిపారు. ‘భారత్‌లో పాక్ పర్యటించాలా? వద్దా? అనేది బీసీసీఐ నిర్ణయిస్తుంది. కానీ, ఒకేసారి రెండు విషయాలను అమలు చేయలేమని నేను బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే చెప్పాను. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ పాక్‌లో భారత్ ఆడాలని ఆశించకూడదు. ముందు భారత్‌పై కాల్పులను ఆపండి. బాంబులు వేయడం ఆపండి. ఉగ్రవాదాన్ని ఆపండి. ఎప్పుడైతే పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకాలపాలను ఆపుతుందో అప్పుడు భారత జట్టు పాక్‌కు వెళ్లి క్రికెట్ ఆడుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.’ అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

కాగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. చివరిసారిగా భారత్ 2008లో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత కేవలం ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఇరు జట్లు ఎదురుపడుతున్నాయి. గతేడాది ఆసియా కప్‌‌కు పాక్ ఆతిథ్యమివ్వగా.. భారత్ దాయాదీ దేశం వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారత్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed