తడబడ్డ బ్యాటర్లు.. పోరాడుతున్న ధ్రువ్ జురెల్, కుల్దీప్

by Harish |
తడబడ్డ బ్యాటర్లు.. పోరాడుతున్న ధ్రువ్ జురెల్, కుల్దీప్
X

దిశ, స్పోర్ట్స్ : తొలి రోజే పట్టు సాధించే అవకాశాలను చేజార్చుకున్న టీమ్ ఇండియా రెండో రోజు బ్యాటుతోనూ తడబడి మ్యాచ్‌లో వెనుకబడింది. ఇంగ్లాండ్ స్పిన్‌లో చిక్కుకున్న భారత క్రికెటర్లు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమై వెనుదిరిగారు. జైశ్వాల్ హాఫ్ సెంచరీకి తోడు, ధ్రువ్ జురెల్-కుల్దీప్ జోడీ పోరాటంతో రెండో రోజు టీమ్ ఇండియా ఆలౌట్ నుంచి బయటపడింది. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లను కోల్పోయి 219 పరుగులు చేసింది. రోహిత్ సేన ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉన్నది. ప్రస్తుతం ధ్రువ్ జురెల్(30 బ్యాటింగ్), కుల్దీప్ యాదవ్(17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉండగా మూడో రోజు తొలి సెషన్‌‌లోనే భారత్ ఆలౌటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేస్తేనే మ్యాచ్‌లో భారత్‌‌ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే మ్యాచ్‌ పూర్తిగా ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్తుంది.

చివరి మూడు వికెట్లు జడేజా ఖాతాలోకే..

ఓవర్‌నైట్ స్కోరు 302/7తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ ఆట తొలి సెషన్‌లోనే ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 51 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు జడేజా ఖాతాలోకి వెళ్లాయి. సెంచరీ వీరుడు రూట్(122 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మరో ఓవర్‌నైట్ బ్యాటర్ రాబిన్సన్(58) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోడీ 8 వికెట్‌గా 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జడేజా ఒకే ఓవర్‌లో రాబిన్సన్‌తోపాటు షోయబ్ బషీర్(0)ను అవుట్ చేశాడు. జడేజా బౌలింగ్‌లోనే జేమ్స్ అండర్సన్(0)ను వికెట్ల ముందు దొరికిపోవడంతో ఇంగ్లాండ్ 353 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు, ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీయగా.. సిరాజ్‌కు 2 వికెట్లు, అశ్విన్‌కు ఒక వికెట్ దక్కింది.

పోరాటం చేస్తున్న ధ్రువ్ జురెల్, కుల్దీప్

తొలి సెషన్‌లోనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆద్యంతం తడబడుతూనే సాగింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే రోహిత్(2) అవుటవడంతో భారత్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు, భీకర ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అదే ఫామ్‌ను కొనసాగించాడు. మొదట గిల్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరు ఆచితూచి ఆడుతూనే అడపాదడపా బంతులను బౌండరీలకు తరలించారు. క్రీజులో పాతుకపోయారునుకున్న తరుణంలో గిల్(38)ను షోయబ్ బషీర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం దక్కకపోవడంతో గిల్ నిరాశగా మైదానం వీడాడు. దీంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత జైశ్వాల్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో రజత్ పాటిదార్(17) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరగాడు. ఈ సారి జడేజా(12) కూడా ఆదుకోలేకపోయాడు. వరుసగా ఫోర్, రెండు సిక్స్‌లు కొట్టి ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన జడ్డూ ఆ తర్వాతి ఓవర్‌లోనే ఓలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే జైశ్వాల్ సైతం వెనుదిరిగాడు. గిల్, రజత్ పాటిదార్, జడేజా, జైశ్వాల్.. ఈ నలుగురు షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. దీంతో 161 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. సర్ఫరాజ్ ఖాన్(14), అశ్విన్(1) సైతం నిరాశపర్చడంతో జట్టు 177/7 స్కోరుతో ఆలౌట్ అంచున నిలిచింది. ఈ పరిస్థితుల్లో ధ్రువ్ జురెల్(30 బ్యాటింగ్), కుల్దీప్(17 బ్యాటింగ్) అసాధారణ ప్రదర్శన కనబరిచారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో ఆచితూచి ఆడిన వీరు వికెట్ కాపాడుకుని రెండో రోజు ఆటను ముగించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. టామ్ హార్ట్లీ 2 వికెట్లు, అండర్సన్ ఒక వికెట్ తీశారు.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 353 ఆలౌట్(104.5 ఓవర్లు)

జాక్ క్రాలీ(బి)ఆకాశ్ 42, డక్కెట్(సి)ధ్రువ్ జురెల్(బి)ఆకాశ్ 11, ఓలీ పోప్ ఎల్బీడబ్ల్యూ(బి)ఆకాశ్ 0, రూట్ 122 నాటౌట్, బెయిర్‌స్టో ఎల్బీడబ్ల్యూ(బి)అశ్విన్ 38, స్టోక్స్ ఎల్బీడబ్ల్యూ(బి)జడేజా 3, ఫోక్స్(సి)జడేజా(బి)సిరాజ్ 47, టామ్ హార్ట్లీ(బి)సిరాజ్ 13, రాబిన్సన్(సి)ధ్రువ్ జురెల్(బి)జడేజా 58, బషీర్(సి)రజత్ పాటిదార్(బి)జడేజా 0, అండర్సన్ ఎల్బీడబ్ల్యూ(బి)జడేజా 0; ఎక్స్‌ట్రాలు 19.

వికెట్ల పతనం : 47-1, 47-2, 57-3, 109-4, 112-5, 225-6, 245-7, 347-8, 349-9, 353-10

బౌలింగ్ : సిరాజ్(18-3-78-2), ఆకాశ్(19-0-83-3), జడేజా(32.5-7-67-4), అశ్విన్(22-1-83-1), కుల్దీప్(12-4-22-0), జైశ్వాల్(1-0-6-0)

భారత్ తొలి ఇన్నింగ్స్ : 219/7(73 ఓవర్లు)

జైశ్వాల్(బి)బషీర్ 73, రోహిత్(సి)ఫోక్స్(బి)అండర్సన్ 2, గిల్ ఎల్బీడబ్ల్యూ(బి)బషీర్ 38, రజత్ పాటిదార్ ఎల్బీడబ్ల్యూ(బి)బషీర్ 17, జడేజా(సి)ఓలీ పోప్(బి)బషీర్ 12, సర్ఫరాజ్ ఖాన్(సి)రూట్(బి)టామ్ హార్ట్లీ 14, ధ్రువ్ జురెల్ 30 బ్యాటింగ్, అశ్విన్ ఎల్బీడబ్ల్యూ(బి)టామ్ హార్ట్లీ 1, కుల్దీప్ 17 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 15.

వికెట్ల పతనం : 4-1, 86-2, 112-3, 130-4, 161-5, 171-6, 177-7

బౌలింగ్ : అండర్సన్(12-4-36-1), రాబిన్సన్(9-0-39-0), షోయబ్ బషీర్(32-4-84-4), టామ్ హార్ట్లీ(19-5-47-2), రూట్(1-0-1-0)

Advertisement

Next Story