IND VS ENG : షమీ వచ్చేశాడు.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక.. స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి

by Harish |
IND VS ENG : షమీ వచ్చేశాడు.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక.. స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేశాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ నేతృత్వంలో 15 మందితో కూడిన జట్టును వెల్లడించింది. 2023 వన్డే వరల్డ్ కప్‌ తర్వాత షమీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. గాయం, సర్జరీ నుంచి కోలుకున్న అతను ఇటీవల దేశవాళీలో సత్తాచాటాడు. ఆస్ట్రేలియా టూరులోనే భారత జట్టులో చేరుతాడని వార్తలు వచ్చినా మోకాలి వాపు కారణంగా సాధ్యపడలేదు. ఇప్పుడు షమీ పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికవుతాడని వచ్చిన వార్తలే నిజమయ్యాయి. వన్డే జట్టులో చోటు దక్కుతుందని వార్తలు వచ్చినా అనూహ్యంగా టీ20లకు ఎంపికయ్యాడు. దీంతో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలో అతని చేరిక ఖాయమే అని తెలుస్తోంది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో ఈ సిరీస్‌లో బౌలింగ్ దళానికి షమీ నాయకత్వం వహించనున్నాడు. షమీ 2022లో ఇంగ్లాండ్‌పైనే చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్‌పైనే పునరాగమనం చేయనున్నాడు.

వాళ్లకు రెస్ట్.. అక్షర్‌కు ప్రమోషన్

కొంతకాలంగా టీ20లకు యువకులను ఎంపిక చేస్తున్న సెలెక్టర్లు ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కూడా అదే పద్ధతిని పాటించారు. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చారు. గత పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్‌కు రెస్ట్ ఇవ్వడంతో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ దక్కింది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ అతను డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌‌‌కు చోటు దక్కుతుందని వార్తలు వచ్చినా అతని కూడా రెస్ట్ ఇచ్చారు. తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తమ స్థానాలను కాపాడుకున్నారు. జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, శివమ్ దూబె, మయాంక్ యాదవ్‌, అవేశ్ ఖాన్, యశ్ దయాల్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఐదు టీ20ల సిరీస్ ఈ నెల 22న ప్రారంభంకానుంది. కోల్‌కతా వేదికగా తొలి టీ20 జరగనుంది. ఈ నెల 25, 28, 31, ఫిబ్రవరి 2 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత టీ20 జట్టు

సూర్యకుమార్(కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.

Next Story

Most Viewed