పోరాడి ఓడిన భారత్.. రోహిత్ శర్మ అద్భుత ఇన్సింగ్‌ వృధా

by Mahesh |   ( Updated:2022-12-07 15:00:34.0  )
పోరాడి ఓడిన భారత్.. రోహిత్ శర్మ అద్భుత ఇన్సింగ్‌ వృధా
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరో మ్యా్చ్ మిగిలుండగానే అతిథ్య బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా 5 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించి.. 2-0 తేడాతో సిరీస్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ యంగ్ ఆల్ రౌండర్ మెహాది హాసన్ (100) సెంచరీతో ఆకట్టుకోగా.. మహ్మదుల్లా 77 పరుగులు చేసి బంగ్లాకు భారీ స్కోర్ అందించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా.. వాషింగ్‌టన్ సుందర్ 3 కీలక వికెట్లు తీశాడు. అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది.

కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో.. శిఖర్ ధావన్‌తో కలిసి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కోహ్లీ 5, ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన యంగ్ ఆల్ రౌండర్ వాషింగటన్ సుందర్ సైతం 11 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ జోడి అదుకుంది. శ్రేయస్ కీలక సమయంలో 82 పరుగులు చేసి భారత్‌ను ఆదుకోగా.. యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ హాఫ్ సెంచరీ చేశాడు.

విజయం దిశగా సాగిపోతున్న ఇండియాకు బంగ్లా సెంచరీ హీరో మెహాది హాసన్ బ్రేక్ వేశాడు. 82 పరుగుల వద్ద మెహాదీ హాసన్ బౌలింగ్‌లో అయ్యర్ పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్‌కు కేవలం 28 బంతుల్లోనే 51 పరుగులు చేసి భారత్‌ను విజయం దిశగా నడిపించినప్పటికీ.. కావాల్సిన పరుగులు, బంతులు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో చివరికి రోహిత్ పోరాటం వృధా అయింది. భారత్ 5 పరుగులతో తేడాతో ఓటమి పాలైంది. బంగ్లా బౌలర్లలో హుస్సేన్ 3, హాసన్ 2, షకీబ్ 2 వికెట్లు తీయగా.. మహ్మదుల్లా, ముస్తాఫిజుర్ రెహ్మన్ తలో వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed