ఉదయ్, సచిన్ అద్భుత పోరాటం..అండర్-19 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు యువ భారత్

by Harish |
ఉదయ్, సచిన్ అద్భుత పోరాటం..అండర్-19 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు యువ భారత్
X

దిశ, స్పోర్ట్స్ : సెమీస్‌కు ముందు యువ భారత్‌ వరుసగా ఐదు విజయాలతో జోరు మీద ఉన్నది. సౌతాఫ్రికాపై కూడా గెలుపు భారత్‌దే అన్న అంచనాలు. అందుకు తగ్గట్టే సఫారీలను మోస్తరు స్కోరుకే పరిమితం చేసింది. కానీ, 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కుర్రాళ్లు శ్రమించక తప్పలేదు. ఒక దశలో ఓటమి తప్పదేమో అన్న టెన్షన్. అయితే, కెప్టెన్ ఉదయ్, సచిన్ దాస్‌ల అద్భుత పోరాటం యువ భారత్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీ చరిత్రలో రికార్డు స్థాయి టైటిళ్లతో తిరుగులేని రికార్డు కలిగిన భారత్ 9వ సారి తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో సెమీస్ జరగనుంది. అందులో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్‌తో తాడోపేడో తేల్చుకోనుంది.

ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో ఓటమెన్నదే ఎరుగని యువ భారత్ సెమీస్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. బెనోని వేదికగా మంగళవారం చివరి వరకూ ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. ప్రిటోరియస్(76), రిచర్డ్ సెలెట్స్వానె(64) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని(3/60) సత్తాచాటగా.. ముషీర్ ఖాన్(2/43) రాణించాడు. 245 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.5 ఓవర్లలో ఛేదించింది. 8 వికెట్లను కోల్పోయి 248 పరుగులు చేసింది. ఒక దశలో టీమ్ ఇండియా 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, సచిన్ దాస్(96), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కెప్టెన్ ఉదయ్ సహారన్(81) అద్భుత పోరాటంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ట్రిస్టన్ లూస్(3/37), క్వెనా మఫాకా(3/32) రాణించారు.

32/4 నుంచి విజయతీరాలకు

245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఆరంభంలోనే టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ ఆదర్శ్(0), ముషీర్ ఖాన్(4), అర్షిన్(12), ప్రియాన్ష్(5) దారుణంగా నిరాశపరిచారు. టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న ఈ నలుగురు ఆటగాళ్లు తేలిపోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఉదయ్ కాస్త నిదానంగా ఆడగా.. సచిన్ మాత్రం ధాటిగా ఆడాడు. చెత్త బంతిని బౌండరీకి తరలించేందుకు ఏ మాత్రం ఆలోచించలేదు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 171 పరుగులు జోడించి జట్టు విజయానికి దారులు వేసింది. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన సచిన్‌(96) క్యాచ్ అవుటై తృటిలో శతకం చేజార్చుకున్నాడు. ఆ తర్వాత సఫారీ బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అయితే, అవనీశ్(10), రాజ్ లింబాని(13 నాటౌట్) సహకారంతో ఉదయ్ జట్టును విజయానికి దగ్గర చేశాడు. మరో పరుగు తీస్తే జట్టు గెలుపు ఖాయమనుకున్న తరుణంలో ఉదయ్(81) రనౌటయ్యాడు. అయితే, రాజ్ లింబానీ ఆ తర్వాతి బంతినే ఫోర్ కొట్టి విజయం లాంఛనం చేశాడు.

సఫారీలను మోస్తరు స్కోరు కట్టడి చేసిన బౌలర్లు

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు మొదటి నుంచే కట్టడి చేశారు. రాజ్ లింబానీ దెబ్బకు ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్ స్టీవ్ స్టోల్క్(14)తోపాటు డేవిడ్ టీగర్(0)ను పెవిలియన్ పంపాడు. 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును ఓపెనర్ ప్రిటోరియస్(76), రిచర్డ్ సెలెట్స్వానె(64) ఆదుకున్నారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించింది. ప్రిటోరియస్‌ను అవుట్ చేసిన ముషీర్ ఖాన్ ఈ జోడీని విడదీశాడు. ప్రిటోరిస్ అవుటైనా తర్వాత రిచర్డ్ జట్టుకు పోరాడే స్కోరు అందించేందుకు కష్టపడ్డాడు. అయితే, మరో ఎండ్‌లో భారత బౌలర్లు కీలక వికెట్లు తీస్తూ జట్టును కష్టాల్లోకి నెట్టారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే అతన్ని నమన్ తివారి అవుట్ చేశాడు. ఆఖర్లో కెప్టెన్ జేమ్స్(24), ట్రిస్టన్ లూస్(23 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు.

స్కోరుబోర్డు

సౌతాఫ్రికా అండర్-19 ఇన్నింగ్స్ : 244/7(50 ఓవర్లు)

ప్రిటోరియస్(సి)అభిషేక్(బి)ముషీర్ 76, స్టీవ్ స్టోల్క్(సి)అవనీశ్(బి)రాజ్ లింబాని 14, డేవిడ్ టీగర్(బి)రాజ్ లింబాని 0, రిచర్డ్ సెలెట్స్వానె(సి)ప్రియాన్ష్(బి)నమన్ తివారి 64, వైట్‌హెడ్(సి)సచిన్ దాస్(బి)ముషీర్ 22, డెవాన్ మరైస్(సి)అభిషేక్(బి)సౌమీ పాండే 3, జేమ్స్(సి)అవనీశ్(బి)రాజ్ లింబాని 24, రిలే నార్టన్ 7 నాటౌట్, ట్రిస్టన్ లూస్ 23 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11.

వికెట్ల పతనం : 23-1, 46-2, 118-3, 163-4, 174-5, 214-6, 220-7

బౌలింగ్ : రాజ్ లింబాని(9-0-60-3), నమన్ తివారి(8-0-52-1), అభిషేక్(4-0-14-0), అర్షిన్(2-0-10-0), సౌమీ పాండే(10-0-38-1), ముషీర్ ఖాన్(10-1-43-2), ప్రియాన్ష్(7-1-25-0)

భారత్ అండర్-19 ఇన్నింగ్స్ : 248/8(48.5 ఓవర్లు)

ఆదర్శ్(సి)ప్రిటోరియస్(బి)క్వెనా మఫాకా 0, అర్షిన్(సి)జేమ్స్(బి)ట్రిస్టన్ లూస్ 12, ముషీర్(సి)జేమ్స్(బి)ట్రిస్టన్ లూస్ 4, ఉదయ్ రనౌట్(వైట్ హెడ్/మోకోనా) 81, ప్రియాన్ష్(సి)ప్రిటోరియస్(బి)ట్రిస్టన్ లూస్ 5, సచిన్ దాస్(సి)డేవిడ్ టీగర్(బి)క్వెనా మఫాకా 96, అవనీశ్(సి)నార్టన్(బి)క్వెనా మఫాకా 10, అభిషేక్ రనౌట్ 0, రాజ్ లింబాని 13 నాటౌట్, నమన్ తివారి 0నాటౌట్; ఎక్స్‌ట్రాలు 27.

వికెట్ల పతనం : 0-1, 8-2, 25-3, 32-4, 203-5, 226-6, 227-7, 244-8

బౌలింగ్ : క్వెనా మఫాకా(10-0-32-3), ట్రిస్టన్ లూస్(10-1-37-3), రిలే నార్టన్(9-0-53-0), మోకోన(7.5-0-45-0), స్టీవ్ స్టోల్క్(2-0-18-0), జేమ్స్(8-0-44-0), వైట్‌హెడ్(2-0-17-0)

Advertisement

Next Story

Most Viewed