రనౌట్‌పై సర్ఫరాజ్ రియాక్షన్.. జడేజాతో ఏం మాట్లాడాడో చెప్పేశాడు

by Harish |
రనౌట్‌పై సర్ఫరాజ్ రియాక్షన్.. జడేజాతో ఏం మాట్లాడాడో చెప్పేశాడు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌లో అతన్ని దురదృష్టం వెంటాడింది. దూకుడుగా ఆడుతున్న అతను రనౌట్‌గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. అండర్సన్ బౌలింగ్‌లో ఐదో బంతిని డిఫెన్స్ ఆడిన జడేజా సింగిల్ కోసం సర్ఫరాజ్‌‌ను పిలిచాడు. దాంతో సర్ఫరాజ్ పరుగు కోసం వెళ్లాడు. అయితే, బంతి నేరుగా మార్క్‌వుడ్ చేతికి వెళ్లగా.. అది గమనించిన జడేజా పరుగు ఆపేశాడు. అప్పటికే సర్ఫరాజ్ ఖాన్ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. మార్క్‌వుడ్ డైరెక్ట్ త్రోతో వికెట్లను పడగొట్టేయడంతో సర్ఫరాజ్ ఖాన్ నిరాశగా మైదానం వీడాడు. ఈ ఘటనలో నెటిజన్లు సర్ఫరాజ్‌‌కు మద్దతుగా నిలుస్తున్నారు. జడేజా సెల్ఫిష్ ఆలోచించాడని కామెంట్లు చేస్తున్నారు.

తొలి రోజు ఆట ముగిసిన తర్వాత రనౌట్‌పై సర్ఫరాజ్ ఖాన్ స్పందించాడు. ఆటలో ఇదంతా సహజమేనన్నాడు. ‘క్రికెట్‌లో మిస్‌కమ్యూనికేషన్ అప్పుడప్పుడు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రనౌట్లు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో పరుగులు సాధిస్తాం.’ అని తెలిపాడు. లంచ్ విరామంలో తాను జడేజాతో మాట్లాడానని, మైదానంతో తనతో మాట్లాడుతూ ఉండాలని కోరానని చెప్పాడు. ‘మాట్లాడుతూ బ్యాటింగ్ చేయడం ఇష్టం. అందుకే, మైదానంలో నాతో మాట్లాడాలని జడేజాను కోరా. అతను నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను బ్యాటింగ్ చేస్తున్నంత సేపు నన్ను ప్రోత్సహించాడు.’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. జడేజా తప్పిదానికి సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ కావడంతో రోహిత్ శర్మ చాలా డిస్సాపాయింట్ అయ్యాడు. ప్రస్టేషన్‌తో తన క్యాప్‌ను నేలకేసి కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed