- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IND vs ENG : వన్డే సిరీస్‌పై కన్నేసిన భారత్.. కటక్‌లోనే పట్టేస్తుందా?

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా.. వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో నెగ్గింది. సిరీస్‌లో శుభారంభం చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. నేడు కటక్ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఆ మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించాలని భారత్ భావిస్తున్నది. ఆఖరి వన్డే మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. అయితే, బ్యాటింగ్, బౌలింగ్ పరంగా జట్టు పటిష్టంగానే ఉన్నా.. కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ జట్టును ఆందోళన కలిగిస్తున్నది. తొలి వన్డేలో 2 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యారు. చాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న సమయంలో అతను తిరిగి ఫామ్ అందుకోవడం అత్యవసరం. కేఎల్ రాహుల్ కూడా నిరాశపరిచాడు. నాగ్‌పూర్‌లో రెండు పరుగులే చేసి వికెట్ పారేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ దళానికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ముగ్గురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 249 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. రెండో వన్డేల్లోనూ వీరికితోడు రోహిత్, రాహుల్ రాణిస్తే భారత్‌కు బ్యాటింగ్ పరంగా ఢోకా ఉండదు. మరోవైపు, స్టార్ పేసర్ మహ్మద్ షమీ బ్యాటర్లను కట్టడి చేస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నాడు. తొలి వన్డేలో ఒక్క వికెటే తీశాడు. జట్టు అతని నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నది. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమైతే బౌలింగ్ భారాన్ని మోయాల్సింది అతనే. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తే ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడం పెద్ద కష్టమేమీ కాదని భారత్ తొలి వన్డేలో నిరూపించింది. కాబట్టి, రెండో వన్డేలోనూ రోహిత్ సేన ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటాలని చూస్తున్నాది.
కోహ్లీ తుది జట్టులోకి వస్తే..
రెండో వన్డే కోసం భారత్ తుది జట్టులో రెండు మార్పులు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మోకాలి గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ కటక్ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. అతను ఫిట్‌గానే ఉన్నాడని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. అయితే, విరాట్‌ను తీసుకోవాలంటే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అతను నాగ్‌పూర్ మ్యాచ్ ఆడకపోవడంతో శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చాడు. అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అయ్యర్ 36 బంతుల్లో 59 పరుగులతో సత్తాచాటాడు. కాబట్టి, అయ్యర్‌ను తప్పించే అవకాశం లేదు. యువ ఓపెనర్ యశస్వి జైశాల్‌పైనే వేటు పడే అవకాశాలే ఎక్కువ.తొలి వన్డేలో అతను 15 పరుగులే చేశాడు. జైశ్వాల్‌ను తప్పిస్తే గిల్ తిరిగి ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు రానున్నాడు. విరాట్ 3వ స్థానంలో దిగుతాడు. మరోవైపు, అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటిన యువ పేసర్ హర్షిత్ రాణాను పక్కనపెట్టనున్నట్టు తెలుస్తోంది. హర్షిత్ స్థానంలో మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోనున్నట్టు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నద్ధమయ్యేందుకు అతనికి తుది జట్టులో చోటు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
పిచ్ రిపోర్టు
కటక్‌లోని బారాబతి స్టేడియంలో 19 వన్డేలు జరిగాయి. చివరిసారిగా 2019లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. గత మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే, హై స్కోరింగ్ వేదికగా ఈ స్టేడియం పేరుగాంచింది. అలాగే, స్పిన్నర్లు కూడా ప్రభావం చూపించగలరు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇది బ్యాటింగ్ జట్టుకు సవాల్ కానుంది. కాబట్టి, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే చాన్స్ ఉంది. 19 మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 7సార్లు గెలిస్తే.. చేజింగ్ చేసిన జట్లు 12 సందర్భాల్లో విజయాలు సాధించాయి.
భారత్ 3.. ఇంగ్లాండ్ 2
కటక్ స్టేడియంలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 17 మ్యాచ్‌ల్లో 13 విజయాలు నమోదు చేసింది. గతంలో ఈ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ ఐదుసార్లు వన్డేల్లో తలపడ్డాయి. మూడింటి భారత్ నెగ్గితే.. రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇరు జట్ల మధ్య ఈ సారి కూడా పోరు హోరాహోరీ సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే, 2007 నుంచి భారత్ ఇక్కడ వన్డే మ్యాచ్‌ను కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో ఆఖరి రెండు సందర్భాల్లోనూ(2008, 2017) టీమిండియానే విజయం వరించింది.
- Tags
- #IND vs ENG