డబ్ల్యూటీసీ ఫైనల్ తేదీ ఖరారు.. ఆ ప్రతిష్టాత్మక స్టేడియంలో టెస్టు మ్యాచ్

by Harish |
డబ్ల్యూటీసీ ఫైనల్ తేదీ ఖరారు.. ఆ ప్రతిష్టాత్మక స్టేడియంలో టెస్టు మ్యాచ్
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు లండన్‌లోని లార్డ్స్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఫైనల్ మ్యాచ్ తేదీలను ఐసీసీ మంగళవారం ఖరారు చేసింది. వచ్చే ఏడాది లార్డ్స్ స్టేడియంలో జూన్ 11 నుంచి 15 మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 16ను రిజర్వ్ డేగా కేటాయించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వడం లార్డ్స్‌కు ఇదే తొలిసారి. తొలి ఎడిషన్ ఫైనల్‌ 2021లో సౌతాంప్టన్‌‌లో, 2023లో రెండో ఎడిషన్ ఫైనల్‌ ఓవల్ స్టేడియాల్లో జరిగాయి.

ఈ రెండు ఎడిషన్లలోనూ ఫైనల్‌కు చేరిన టీమ్ ఇండియా టైటిల్ పోరులో బోల్తాపడింది. ప్రస్తుత ఎడిషన్ 2023-25 సర్కిల్‌లోనూ రోహిత్ సేన ఫైనల్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో భారత జట్టు 74 పాయింట్లు, 68.52 పర్సంటేజ్‌తో అగ్రస్థానంలో ఉన్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ వరుసగా టాప్-5లో నిలిచాయి. త్వరలో టీమిండియా వరుస టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ నెల చివర్లో బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల ఆడనుంది. ఇక, నవంబర్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.

Advertisement

Next Story

Most Viewed