నా కొడుకుకు తండ్రి ప్రేమను పంచాలనుంది.. మరోసారి ఎమోషనల్ అయిన శిఖర్ ధావన్

by Harish |
నా కొడుకుకు తండ్రి ప్రేమను పంచాలనుంది.. మరోసారి ఎమోషనల్ అయిన శిఖర్ ధావన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కొంతకాలంగా క్రికెట్ కెరీర్‌తోపాటు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది భార్య ఆయేషా ముఖర్జీతో ధావన్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వారి కుమారుడు జోరావర్ ఆస్ట్రేలియాలో ఆయేషాతోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో జోరావర్‌ను ధావన్ చాలా మిస్ అవుతున్నాడు. ఇటీవల జోరావర్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ ఎమోషనల్ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన కొడుకును గుర్తు చేసుకుంటూ ధావన్ ఎమోషనల్ అయ్యాడు.

హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఇంటర్వ్యూలో జోరావర్‌ను ఎంత మిస్ అవుతున్నాడో వివరించాడు. ‘తన కొడుకును చూడటానికి ఒక వారం పాటు ఆస్ట్రేలియాకు వెళ్తే.. అతను నాతో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. అతనితో నేను చాలా సమయం గడపాలనుకుంటున్నా. నా చేతుల్లో నిద్రపుచ్చాలని ఉంది. గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది. నా కొడుకుకు తండ్రి ప్రేమను పంచాలని ఉంది. నేను అతనితోపాటు మాట్లాడి దాదాపు 5-6 నెలలు అవుతుంది. అతను సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ఎప్పటికైనా నన్ను కలుస్తాడనే ఆశతోనే ఉన్నా.’ అని ధావన్ తెలిపాడు. కాగా, యువ క్రికెటర్లు రాణిస్తుండటంతో ధావన్‌ జట్టుకు దూరమయ్యాడు. 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ తరపున చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.

Advertisement

Next Story

Most Viewed