తెలంగాణ క్రికెటర్లకు గుడ్ న్యూస్.. మూడు కొత్త స్టేడియాలు నిర్మాణం

by Harish |
తెలంగాణ క్రికెటర్లకు గుడ్ న్యూస్.. మూడు కొత్త స్టేడియాలు నిర్మాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌‌‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. ఆదివారం హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ క్రికెటర్ల పురోగతిని దృష్టి పెట్టుకుని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్‌ను హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా నియమించే ఆలోచనలో ఉన్నామని, ఆయనతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.

రెండు, మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. టెండర్లు పిలిచి మహబూబ్‌నగర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్, నిజామాబాద్ స్టేడియానికి చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నామని చెప్పారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆడిట్‌లను ఆమోదించామని, బీసీసీఐకి పంపిస్తే పెండింగ్ నిధులు కూడా రిలీజ్ అవుతాయన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై కమిటీ వేశామని, ఆ కమిటీ విచారించి, బిల్లులు చెల్లింపులు చేస్తుందని తెలిపారు.

కార్యదర్శి దేవ్‌రాజ్ మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి డొమిస్టిక్ సీజన్ ప్రారంభమవుతుందని చెప్పారు. మ‌హిళ‌ల లీగ్ క్రికెట్‌‌కు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించే ప్రణాళిక ఉందని, కొత్త కోచ్‌లు, అంపైర్లు, గ్రౌండ్స్‌మెన్, స్కోరర్ల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed