టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన జడేజా

by Harish |
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన జడేజా
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తొడకండరాల గాయంతో రెండో టెస్టుకు దూరమైన అతను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. దీంతో మిగతా మ్యాచ్‌లకు అతను తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఫిట్‌నెస్ సాధిస్తేనే అతను మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. మూడో టెస్టు ఆడేందుకు మెడికల్ టీమ్ అతనికి క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమ్ ఇండియా ప్లేయర్లు సోమవారం రాజ్‌కోట్‌కు చేరుకున్నారు. అలాగే, టీమ్ మేనేజ్‌మెంట్ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించగా.. జడేజా ప్రాక్టీస్ షురూ చేశాడు. ఈ విషయాన్ని జడేజా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను షేర్ చేశాడు.

గుజరాత్‌కు చెందిన జడేజా‌కు హోం గ్రౌండ్ అయిన రాజ్‌కోట్ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను ఇక్కడ ట్రిపుల్ సెంచరీ బాదాడు. 2018లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో జడేజా అజేయ శతకం చేశాడు. అదే మ్యాచ్‌లో బంతితో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. 2016లో ఇంగ్లాండ్‌తో డ్రా చేసుకోవడంలో జడేజా విలువైన పరుగులు జోడించాడు. అజేయంగా నిలిచిన అతను కోహ్లీతో కలిసి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Next Story