చిరుతతో పోరాడిన కుక్క.. జింబాబ్వే మాజీ క్రికెటర్ ప్రాణాలను కాపాడింది

by Harish |
చిరుతతో పోరాడిన కుక్క.. జింబాబ్వే మాజీ క్రికెటర్ ప్రాణాలను కాపాడింది
X

దిశ, స్పోర్ట్స్ : విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదంటారు. విశ్వాసపాత్రుడిగా ఉండే శునకం యజమాని కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని ఘటనలు చాలానే చూశాం. తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది. జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విట్టాల్‌పై చిరుత దాడి చేయగా.. అతని పెంపుడు కుక్క చిరుతతో పోరాడి మరి అతన్ని రక్షించింది. ఈ విషయాన్ని విట్టాల్ భార్య హన్నా సోషల్ వీడియా వేదికగా వెల్లడించింది.

అసలేం జరిగిందంటే.. 51 ఏళ్ల మాజీ ఆల్‌రౌండర్ గై విట్టాల్ జింబాబ్వేలో సఫారీ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల అతను హుమానీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. తన పెంపుడు కుక్క ‘చికారా’ను కూడా తీసుకెళ్లాడు. అనూహ్యంగా ఓ చిరుత విట్టాల్‌పై దాడి చేసింది. దీంతో చికారా తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ చిరుతతో పోరాడింది. చివరికి చిరుత అక్కడి నుంచి తోకముడిచింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన విట్టాల్‌తోపాటు చికారాకు విమానంలో ఆస్ప్రత్రికి తరలించారు.

విట్టాల్‌కు సర్జరీ జరిగిందని, చికారా కోలుకుంటుందని హన్నా తెలిపింది. కాగా, గై విట్టాల్‌‌ జంతువుల బారి నుంచి ప్రాణాలతో బయటపడటం ఇది రెండోసారి. 2013లో 165 కిలోలు ఉన్న భారీ మొసలి వెట్టాల్ ఇంట్లోకి చొరబడింది. రాత్రంతా ఆ మొసలి వెట్టాల్ బెడ్ కిందనే ఉంది. దాన్ని గమనించడంతో అతనికి ప్రాణపాయం తప్పింది. ఈ విషయాన్ని షేర్ చేసుకున్న హన్నా..‘అతను నిజంగా అదృష్టవంతుడు. మొదట మొసలి, ఇప్పుడు చిరుత నుంచి అతను ప్రాణాలతో బయపడ్డాడు.’ అని చెప్పుకొచ్చింది. కాగా, జింబాబ్వే‌కు 10 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన అతను.. 46 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు.

Advertisement

Next Story