FIFA ప్రపంచకప్ 2022 : చిక్కుల్లో మెస్సీ.. కీలక సెమీస్‌కు దూరం!

by Vinod kumar |   ( Updated:2022-12-11 11:45:17.0  )
FIFA ప్రపంచకప్ 2022 : చిక్కుల్లో మెస్సీ.. కీలక సెమీస్‌కు దూరం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2022లో అసాధారణ ప్రదర్శనతో తన జట్టును సెమీఫైనల్ చేర్చిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ చిక్కుల్లో పడ్డాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ విజయానంతరం మెస్సీ, అతని సహచర ఆటగాళ్లు వివాదంలో చిక్కుకున్నారు. మెస్సీ టీమ్ ప్రవర్తన కారణంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పూర్తిగా ఘర్షణ వాతావరణాన్ని తలపించింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీని సద్వినియోగం చేసి, అర్జెంటీనాను 2-0 ఆధిక్యంలోకి నిలిపిన అనంతరం మెస్సీ.. నెదర్లాండ్స్‌ డగౌట్‌ ముందు ఆగి.. ఆ జట్టు కోచ్‌ లూయిస్‌ వాన్‌ గాల్‌ను వెక్కిరించాడు.

ఘర్షణ వాతావరణం.. 17 ఎల్లో కార్డులు..

మ్యాచ్‌ అనంతరం మెస్సీ.. నెదర్లాండ్స్‌ జట్టు కోచ్‌ లూయిస్‌ వాన్‌ గాల్‌తో ఘర్షణకు దిగాడు. మీడియా సమావేశంలో నెదర్లాండ్స్‌ ఆటగాడిని దూషించాడు. అతని సహచరులు చాలా మంది మ్యాచ్‌ సందర్భంగా సహనం కోల్పోయారు. 88వ నిమిషంలో లియోనార్డో పరేదెస్‌ బంతిని నెదర్లాండ్స్‌ డగౌట్‌లోకి తన్నడంతో.. ఆ జట్టు బెంచ్‌ మైదానంలోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. మ్యాచ్‌ రిఫరీ అంటానియో మాత్యూ ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ఏకంగా 17 పసుపు కార్డులు చూపడం విశేషం. ఇది ప్రపంచకప్‌లోనే రికార్డు.

ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం..

మెస్సీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వగా.. ఫిఫా క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఫిఫా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రత్యర్థి జట్టు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆటగాళ్లను దూషించిన కారణంగా మెస్సీపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే అవకాశాలున్నాయి. అదే జరిగితే అర్జెంటీనా కెప్టెన్.. క్రొయేషియాతో జరిగే కీలక సెమీఫైనల్‌కు దూరమవుతాడు. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌లో చోటు చేసుకున్న ఘటనపై, అర్జెంటీనా టీమ్ తీరుపై నెదర్లాండ్స్ ఫిర్యాదు చేసిందని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మ్యాచ్ రిఫరీల తీరుపై మెస్సీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి గురించి మాట్లాడలేని పరిస్థితని పేర్కొన్నాడు. తనపై చర్యలు తీసుకుంటారనే వార్తలపై స్పందించిన మెస్సీ.. ఫిఫా చూసుకుంటుందని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed